ఒవైసీ వ్యాఖ్యలను ఖండించిన మహేశ్వర్ రెడ్డి

ఒవైసీ వ్యాఖ్యలను ఖండించిన మహేశ్వర్ రెడ్డి

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తనపై చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్‌ నేత మహేశ్వర్‌ రెడ్డి ఖండించారు. తాను రూ.25 లక్షలు ఆఫర్ చేశాననడం అబద్ధమని, ఆధారాలుంటే బయటపెట్టాలని ఆయన సవాల్ చేశారు. అసదుద్దీన్‌తో తనకు పరిచయం కూడా లేదు. అసదుద్దీన్ ఆధారాలు బయటపెడితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా. మైనార్టీల ఓట్ల కోసం అసద్‌ను ఇంద్రకరణ్‌రెడ్డి తప్పుదోవ పట్టించారు. అసదుద్దీన్ స్థాయి రూ.25లక్షలు అని తాము భావించడం లేదు. అసద్‌కు డబ్బు ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.
 
నిర్మల్‌లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించకుండా ఉంటే కాంగ్రెస్‌ అభ్యర్థి మహేశ్‌రెడ్డి తమకు రూ.25 లక్షలు ఇస్తామన్నారంటూ నిర్మల్‌లోని గాజులపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోన్‌కాల్ రికార్డు తన వద్ద ఉందని ఆయన ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలూ బయటపెడతానని అసదుద్దీన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.