ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ దెబ్బ

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ దెబ్బ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘మేకింగ్ అమెరికా గ్రేట్ ఎగైన్’ మిగతా ప్రపంచానికి గొప్పగా మింగుడుపడటం లేదు. డాలర్ విలువ, వడ్డీరేట్ల పెరుగుదలతో ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలకు తలబొప్పి కడుతోంది. అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం చైనా వ్యాపారానికి పెను ప్రమాదంగా పరిణమించింది. ట్రంప్ ప్రకటించిన పన్నుల తగ్గింపుతో జీ7 దేశాలలో అమెరికా ఒక్కటి మాత్రమే ఆర్థిక వృద్ధి సాధించగలిగేలా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లు పురోగతి సాధించడం స్వల్పకాల ఆనందంగానే మిగిలిపోయింది. నాట్ వెస్ట్ మార్కెట్ల అభివృద్ధికి దోహదపడే ఆస్తులు.. ఆస్ట్రేలియన్ డాలర్, రాగి ఈ ఏడాది దాదాపుగా 4.5 శాతం పడిపోయాయి. గత ఏడాది ఇవి స్టాండర్డ్ అండ్ పూర్స్ 500 ఇండెక్స్ ప్రకారం ఇది 7 శాతం లాభం సాధించాయి. ఈ ఏడాది వృద్ధిలో అసమతౌల్యతను ఈ ప్రదర్శన వ్యత్యాసం ప్రతిఫలిస్తోందని నాట్ వెస్ట్ క్రాస్ అసెట్ స్ట్రాటజీ హెడ్ జిమ్ మెకార్మిక్ అభిప్రాయపడ్డారు.

ఈ వారం ఫెడరల్ రిజర్వ్ నిర్వహించబోయే వార్షిక విధాన సదస్సులో ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత ప్రపంచవ్యాప్తంగా వృద్ధిరేటుపై మరింత స్పష్టత రానుంది. 2018లో ఫెడరల్ రిజర్వ్ రెండుసార్లు వడ్డీరేట్లు పెంచింది. దీంతో డాలర్ 6 శాతం బలపడటంతో అంతర్జాతీయ రుణగ్రహీతలకు అప్పులు తిరిగి చెల్లించడంతో భారంగా మారింది. జరగబోయే ఫెడరల్ బ్యాంక్ విధాన నిర్ణయ సమావేశం ద్వారా 2019లో వడ్డీరేట్లు ఎలా ఉండబోతున్నాయో చూచాయగా తెలిసే అవకాశం ఉంది. దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను మరింత పెంచే అవకాశం ఉన్నట్టు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇవి భవిష్యత్తులో దానికే ఎదురుదెబ్బగా పరిణమించవచ్చని చెబుతున్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు అమెరికా మోపుతున్న భారాన్ని భరించలేని స్థితికి చేరినపుడు అది తిరిగి అమెరికాపై ప్రభావం చూపనున్నాయని అంటున్నారు. అప్పుడు దేశీయ ద్రవ్య విధానాన్ని మార్చుకోక తప్పదని అంచనా వేస్తున్నారు. 

ఇప్పటికే ఇతర ఆర్థిక వ్యవస్థలపై అమెరికా స్వీయ నియంత్రణ విధానం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న ధోరణి కన్నా అంతర్జాతీయ వృద్ధి అమెరికా వల్ల పెరిగినప్పటికీ, సామర్థ్యానికి మించి కృషి చేస్తున్న దేశాల వాటా 2017లో 80 శాతం కాగా, 2018లో 60 శాతానికి తగ్గిపోయింది. అమెరికాతో వాణిజ్య వివాదం కారణంగా విధాన నిర్ణేతలు రుణాలపై పలు ఆంక్షలు విధించిన కారణంగా చైనా వృద్ధి నిలిచిపోయింది. జపాన్ లో కూడా ఆర్థిక ప్రగతి మందగించింది. యూరప్ లోని చాలా దేశాల్లో వృద్ధిరేటు స్వల్పంగానో, అసలు లేకుండానే కనిపించింది. యూరో దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీలో రెండేళ్లలో మొదటిసారిగా ఫ్యాక్టరీలకు ఆర్డర్లు బాగా తగ్గాయి. బ్రెగ్జిట్ కారణంగా రుణ వ్యయాల చిక్కులు తేలక ఇటలీ పెట్టుబడిదారులతో పంచాయితీలకు సిద్ధం అవుతోంది. 

అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకి వస్తే రాజకీయ సంక్షోభానికి తోడు టర్కీ లిరా దారుణంగా పతనమైంది. వెనిజులా చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అర్జెంటినా తన కరెన్సీ విలువను కాపాడుకొనేందుకు వడ్డీరేట్లు పెంచుతోంది. ప్రస్తుతానికి ఈ దేశాలు వేటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టే శక్తి లేనప్పటికీ ఇది మార్కెట్లపై విశ్వాసానికి పెద్ద దెబ్బగా మారనుంది. ఇది బ్రెజిల్ వంటి పెద్ద దేశాలకు పాకితే మాత్రం పెను ప్రమాదంగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. బ్రెజిల్, దక్షిణ కొరియా, తైవాన్, భారత్ దేశాల వాణిజ్యం ఏడాదికి 5 శాతం కంటే ఎక్కువగా తగ్గుముఖం పట్టడం ప్రమాదకరంగా పరిణమించవచ్చనే హెచ్చరిస్తున్నారు ఆర్థిక నిపుణులు.