సరికొత్త రికార్డు సృష్టించిన మలింగ

సరికొత్త రికార్డు సృష్టించిన మలింగ

శ్రీలంక పేస్ బౌలర్ మలింగ మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 5సార్లు హ్యాట్రిక్ తీసిన తొలి క్రికెటర్‌గా ఘనత సాధించాడు. కివీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీసి ఈ ఫీట్ సొంతం చేసుకున్నాడు. అటు టీ 20ల్లో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు. ఇక తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ చెలరేగిపోయాడు. 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ కు చుక్కలు చూపించాడు. ఒకే ఒవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. మూడో బంతికి ఓపెనర్‌ కొలిన్‌ మన్రోను యార్కర్‌తో బౌల్డ్‌ చేశాడు. తర్వాతి బంతికే రూథర్‌ఫర్డ్‌ను ఎల్‌బీడబ్ల్యూగా పెవిలీయన్‌కు పంపించాడు. అయిదో బంతికి గ్రాండ్‌హోమ్‌ను యార్కర్‌తో ఔట్ చేశాడు. హ్యాట్రిక్‌ తీసిన మలింగ చివరి బంతికి రాస్‌ టేలర్‌ ను కూడా అవుట్ చేశాడు. మ్యాచ్‌ మొత్తంలో 5వికెట్లు తీసిన మలింగ సొంతగడ్డపై శ్రీలంక ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కివీస్ టాప్‌ ఆర్డర్‌ను మలింగ కుప్పకూల్చడంతో 88 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది.