'కేసీఆర్, కేటీఆర్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నా...'

'కేసీఆర్, కేటీఆర్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నా...'

తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు సీఎల్పీ నేతల మల్లు భట్టి విక్రమార్క... ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తారా..? లేదా మీ ఇష్టానుసారంగా నడిపించదలిచారా..? అంటూ మండిపడ్డారు. మీకున్న సంఖ్య బలం ఎంత...? ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పెట్టిన అభ్యర్థులు ఎంత మంది?. సరిపడా సంఖ్యబలం లేదని తెలిసి... ఎవరిని ప్రలోభపెడదామని అభ్యర్థిని పెట్టారో చెప్పాలని నిలదీశారు. తప్పులు చేస్తూ.. ఎదురుదాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన మల్లు భట్టి విక్రమార్క. ఇలాంటి అప్రజాస్వామిక కార్యక్రమాల కోసమే తెలంగాణ రాష్ట్రం తెచుకున్నామా? మా పార్టీలోకి వస్తేనే.. సమస్య పరిష్కారం చేస్తాం అని చెప్పటం ప్రలోభపెట్టడం కాదా..?, మా పార్టీలోకి రండి... సాగర్ నీళ్లు విడుదల చేస్తాం అని చెప్పటం ప్రలోభ పెట్టడం కాదా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.  

గిరిజనుల హక్కులు కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని హితవు పలికారు మల్లు భట్టి విక్రమార్క... గిరిజనులకు భూముల మీద హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేసిన ఆయన... గిరిజనుల భూములు లాక్కుంది మీరు.. పంటలకు ట్రాక్టర్లతో దున్నిచ్చింది టీఆర్ఎస్ పార్టీ.. గిరిజనుల నిధులు పక్కదోవ పట్టించింది టీఆర్ఎస్సే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పంట పొలాలకు నీళ్లు ఇవ్వడానికి కూడా పార్టీ మారండి అని చెప్పడం దారుణమైన విషయమని ఫైర్ అయ్యారు భట్టి.. పినపాక, అసిఫాబాద్ లో టీఆర్‌ఎస్‌ని ప్రజలు తిరస్కరించారని... ప్రజల అభిప్రాయాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయించుకోవటం కోసమే కదా! ఎమ్మెల్యేలను చేర్చుకుంటుందని అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని కాపాడతా అని ప్రమాణం చేసిన సీఎం ... రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు మల్లు భట్టి విక్కమార్క.