జాతీయ పార్టీని ఎలా విలీనం చేస్తారు-భట్టి

జాతీయ పార్టీని ఎలా విలీనం చేస్తారు-భట్టి

కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ దానిని ఒక ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క... పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల్లో 6 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గతంలో పిటిషన్‌ ఇచ్చామని... అలాగే హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి, జాలాల సురేందర్, చిరుమర్తి లింగయ్యలను డిస్ క్వాలిఫై చేయాలని ఇవాళ నోటీస్ ఇచ్చామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం పట్టపగలే ఖూనీ చేస్తోందని మండిపడ్డ భట్టి... అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని.. అనేక ప్రలోభాలకు గురిచేసి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటున్నారని భట్టి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను తక్షణం పదవుల నుంచి డిస్ క్వాలిఫై చేయాలని స్పీకర్ ను కోరినట్లు చెప్పారు. 

కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తామని కొందరు టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు ప్రకటన చేయడాన్ని భట్టి తీవ్రంగా ఖండించారు. పార్టీ విలీనం అనేది చాలా పెద్ద వ్యహారం అని.. గతంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సమయంలో గ్రామ కమిటీల నుంచి పార్టీ అధినేత వరకూ అందరి తీర్మానాలను ఎన్నికల సంఘానికి పంపి.. ఆ తరువాత విలీనం చేయడం జరిగిందని గుర్తుచేశారు భట్టి విక్రమార్క. మరోవైపు ఎమ్మెల్యేలకు నజరానాలు ఇస్తున్నారు.. ఆకర్షిస్తున్నారని ఆరోపించారు షబ్బీర్ అలీ... డిస్ క్వాలిఫికేషన్ నోటీస్ ఇస్తున్న సమయంలో స్పీకర్ ఫొటో తీసుకోవడానికి కూడా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.