మాల్యా కేసులో ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్?

మాల్యా కేసులో ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్?

బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధిపతి విజయ్ మాల్యా కేసు ఇప్పుడు డెక్కన్ ఏవియేషన్ లిమిటెడ్ (డీఏఎల్) వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ మెడకు చుట్టుకొనేలా ఉంది. మాల్యా అప్పుల ఎగవేత కేసులో గోపీనాథ్ పాత్రపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టినట్టు తెలిసింది.అయితే దీనిపై గోపీనాథ్ మాత్రం నోరు విప్పడం లేదు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఙండియా (ఎస్బీఐ) నుంచి తీసుకున్న అప్పులను దారిమళ్లించేందుకు గోపీనాథ్ సంతకాలు చేసిన పత్రాలను ఉపయోగించడాన్ని దర్యాప్తు బృందాలు పరిశీలిస్తున్నాయి. ఎస్బీఐ కాకుండా యాక్సిస్ బ్యాంక్ ఖాతాల ద్వారా నిధులు మళ్లించడంలో గోపీనాథ్ పాత్రను సీబీఐ పరిశోధిస్తోంది. రుణాలు మంజూరు చేసినపుడు గోపీనాథ్ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ డైరెక్టర్ గా ఉన్నారు. 2007లో తన ఎయిర్ డెక్కన్ ను మాల్యాకు అమ్మేసి ఆయన బోర్డ్ లో సభ్యుడిగా చేరారు.

డెక్కన్ ఏవియేషన్ కు ఎస్బీఐ రూ.340 కోట్ల రుణం ఇచ్చిన వ్యవహారంలోనూ గోపీనాథ్ పాత్రని ఏజెన్సీ పరిశీలిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో నిధుల మళ్లింపు పత్రాలపై గోపీనాథ్ సంతకాలు చేసినట్టు తేలింది. 2008 ఫిబ్రవరిలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ గోపీనాథ్ కి రూ.30 కోట్లు చెల్లించడాన్ని కూడా పరిశోధిస్తున్నారు. ఎస్బీఐ ఫిబ్రవరి 1, 2008న కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కి రూ.29.96 కోట్లు విడుదల చేయగానే ఈ చెల్లింపు జరగడం సందేహాలకు తావిస్తోంది. 

షేర్ హోల్డర్లు లేదా హైకోర్ట్ కి తెలియజేయకుండా 'నాన్ కంపీట్ ఫీ' కింద గోపీనాథ్ కి రూ.30 కోట్లు చెల్లించడంపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) 2017లో పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ లావాదేవీలో ప్రత్యక్షంగా పాత్ర ఉన్న పలువురిపై నేరపూరిత కుట్ర, మోసం, తప్పుడు పత్రాలు సృష్టించిన నేరాల కింద అభియోగాలు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐఓ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సిఫార్సు చేసింది.

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, డెక్కన్ ల ఒప్పందంలో కార్పొరేట్ నైతిక విలువలతో రాజీ పడ్డారని ఎస్ఎఫ్ఐఓ తెలిపింది. అయితే డెక్కన్ ఏవియేషన్ లో తాను మైనారిటీ షేర్ హోల్డర్ ని మాత్రమేనని గోపీనాథ్ వాదించారు. ఎస్ఎఫ్ఐఓ నివేదిక ఆధారంగా పరిశోధిస్తున్న సీబీఐ, మాల్యాకు వ్యతిరేకంగా చేస్తున్న వాదనలు గోపీనాథ్ కి కూడా వర్తిస్తాయని భావిస్తున్నట్టు తెలిసింది.