దీదీయే ప్రధాని అభ్యర్థి..!

దీదీయే ప్రధాని అభ్యర్థి..!

ఓ వైపు ప్రధాని నరేంద్ర మోడీ... మరోవైపు ఆయనకు పోటీగా నిలిచే ప్రధాని అభ్యర్థి ఎవరనే చర్చ సాగుతోంది... అయితే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృతణమూల్ కాంగ్రెస్‌ చీఫ్ మమతా బెనర్జీయే రానున్న ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ఉంటారని ప్రకటించింది ఆ పార్టీ... 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రధాని అభ్యర్థిగా మమతా బెనర్జీయే ఉంటారని ఆ పార్టీ ఎంపీ, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రకటించారు. లౌకిక, ప్రగతిశీల భారతావని నిర్మాణం కోసం మమతా బెనర్జీతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వీడియో సందేశమిచ్చిన అభిషేక్ బెనర్జీ.. 2019 ఓ పెద్ద మార్పు తీసుకొచ్చే ఏడాది కావాలి. కార్మికుల కోసం, పీడిత ప్రజల అభ్యున్నతి కోసం ఓ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రధాని అభ్యర్థిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. ఓవైపు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమయ్యే ప్లాన్ జరుగుతుండగా... మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు కూడా జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.