మే 3న విడుదలవుతున్న మమతా బెనర్జీ 'స్ఫూర్తి'తో నిర్మించిన చిత్రం

మే 3న విడుదలవుతున్న మమతా బెనర్జీ 'స్ఫూర్తి'తో నిర్మించిన చిత్రం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయోపిక్ తర్వాత ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిర్మిస్తున్న సినిమాపై వివాదం మొదలైంది. మమతా బయోపిక్ గా చెబుతున్న ఈ బయోపిక్ పై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. మమతా బెనర్జీ జీవితంపై నిర్మించిన ఈ చిత్రంపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేసింది. 

బెంగాల్ లో 'బాఘిని:బెంగాల్ టైగ్రెస్' పేరుతో ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సినిమా మే 3న విడుదల కానుంది. ప్రధానమంత్రి మోడీ బయోపిక్ పై చర్యలు తీసుకున్న ఈసీ, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని బీజేపీ తన లేఖలో ప్రశ్నించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవితంపై నిర్మించిన 'పీఎం నరేంద్ర మోడీ' విడుదలని ఎన్నికల సంఘం అడ్డుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నరేంద్ర మోడీ పాత్ర పోషించారు. 

బీజేపీతో పాటు సీపీఐ(ఎం) నేతలు కూడా ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘాన్ని కలుసుకొని బాఘిని చిత్రం ట్రైలర్ పై కూడా నిషేధం విధించాలని కోరారు. ఈ సినిమా ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉందని వారు చెప్పారు. అయితే నిర్మాత నేహాల్ దత్తా మాత్రం ఇది బయోపిక్ కాదని, మహిళల సంఘర్షణ గురించి కథ అని వాదిస్తున్నారు.