రాజీనామాకు సిద్ధపడ్డ మమత

రాజీనామాకు సిద్ధపడ్డ మమత

లోక్ సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించింది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపాదన ముందుంచారు. అయితే పార్టీ ఈ ప్రతిపాదననను తిరస్కరించింది. సమావేశం తర్వాత మాట్లాడుతూ రాజీనామా గురించి ముందుగానే పార్టీకి సమాచారం అందించానని ఆమె చెప్పారు. అయితే పార్టీ అందుకు నిరాకరించడంతో పదవిలో కొనసాగుతానని తెలిపారు. 

బీజేపీ అద్భుత ప్రదర్శనపై ఆమె సందేహాలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మత ప్రాతిపదికన బీజేపీ ఓట్లను పోలరైజేషన్ చేసిందని మమత ఆరోపించారు.'బెంగాల్ లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు సృష్టించారు. మాకు వ్యతిరేకంగా కేంద్ర భద్రతా బలగాలు పనిచేశాయి. హిందూ-ముస్లిం పరిస్థితిని తీసుకొచ్చారు. దీంతో ఓట్లు చీలిపోయాయి. దీని గురించి మేం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని' ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ తరఫున పని చేసిందని ఆమె తీవ్ర ఆరోపణ చేశారు.