జనంతో 'చౌకీదార్ చోర్ హై' అనిపించిన మమత

జనంతో 'చౌకీదార్ చోర్ హై' అనిపించిన మమత

బెంగాల్ లో చెలరేగుతున్న రాజకీయ దుమారం మధ్యన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డైమండ్ హార్బర్ లో నిర్వహించిన ర్యాలీలో బీజేపీపై నిప్పులు చెరిగారు. మంగళవారం కోల్ కతాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రోడ్ షో హంగామా తర్వాత ఏర్పడిన పరిస్థితులపై మమత తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కారు. ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై చేసిన 'చౌకీదార్ చోర్ హై' నినాదాన్ని భుజానికెత్తుకున్నారు. రామ మందిరంపై మోడీ ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు.

'మీ ప్రధానమంత్రి గత ఐదేళ్లలో ఒక రామ మందిరం నిర్మించలేకపోయారు. మీరు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహం ఏర్పాటు చేస్తామంటున్నారు. దీని కోసం బెంగాల్ ప్రజలు మిమ్మల్ని దేబిరించబోరని' మమత అన్నారు. 

కొన్నాళ్లుగా వినిపించని చౌకీదార్ చోర్ హై నినాదాన్ని మరోసారి మమత తెరపైకి తెచ్చారు. ప్రజలతో 'చౌకీదార్ చోర్ హై' అని నినదింపజేశారు. వేదికపై ఆమె చౌకీదార్-చౌకీదార్ అంటే జనం 'చోర్ హై' అని జవాబిచ్చారు. 

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను గుండాగా అభివర్ణిస్తూ 'మంగళవారం మీ గుండా నేత ఇక్కడికి వచ్చారు. ఆయన బెంగాల్ దివాలా తీసిందన్నారు. బెంగాల్ దివాలా తీసిందా?' అని పదేపదే ప్రజలను అడిగారు.