మమతకు కలకత్తా హైకోర్ట్ మొట్టికాయలు

మమతకు కలకత్తా హైకోర్ట్ మొట్టికాయలు

పశ్చిమ బెంగాల్ లో డాక్టర్ల సమ్మె, రాజీనామా వార్తలపై కలకత్తా హైకోర్ట్ మమత ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. ఈ వ్యవహారాన్ని చర్చలతో పరిష్కరించాల్సిందిగా హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. డాక్టర్ల భద్రతకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందని మమత ప్రభుత్వాన్ని హైకోర్ట్ ప్రశ్నించింది. 

పశ్చిమ బెంగాల్ లో డాక్టర్ల సమ్మెకు పరిష్కారం సాధించేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అగ్రశ్రేణి డాక్టర్ల ప్యానెల్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశం కోల్ కతాలో జరుగుతోంది. ఈ సమావేశంలో డాక్టర్ మాఖన్ లాల్ షాహా, అభిజిత్ ముఖర్జీ, అలాకేందు ఘోష్, మంత్రి డాక్టర్ నిర్మల్ మాంఝీ పాల్గొంటున్నారు. 

మరోవైపు కలకత్తా హైకోర్ట్ సమ్మెకు దిగిన డాక్టర్లకు వాళ్ల ప్రమాణాన్ని గుర్తు చేసింది. డాక్టర్లు అన్ని పరిస్థితుల్లోనూ సమాజానికి సేవ చేస్తామని ప్రమాణం చేశారని హైకోర్ట్ చీఫ్ జస్టిస్ బెంచ్ చెప్పింది. ఈ ప్రమాణాన్ని డాక్టర్లు గుర్తుంచుకోవాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై రిపోర్ట్ దాఖలు చేయాలని బెంచ్ ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ సమర్పించాలని కోర్టు చెప్పింది.