వృద్దురాలి వద్ద నుండి కోటి సొత్తు చోరీ.. ఎలా దొరికాడంటే ?

వృద్దురాలి వద్ద నుండి కోటి సొత్తు చోరీ.. ఎలా దొరికాడంటే ?

ఒంటరిగా నివసిస్తున్న వృద్దురాలిని టార్గెట్ చేసాడు. ఎలా అయినా సరే ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలు దోచేయడానికి ప్లాన్ వేసాడు ఆ కేటుగాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సుమారు కోటి రూపాయలు కాజేయాలని చూసి ఇంటి కొనుగోలు పేరుతో మాయ మాటలు చెప్పి ఆమె వద్ద ఉన్న విలువైన సొత్తును దోచేసాడు. జరిగిన మోసాన్ని గుర్తించి చివరకు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాందా వృద్దురాలు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడను కటకటాల పాలు చేసి వృద్దురాలి సొత్తుని రికవరీ చేసి అందించారు. వివరాల్లోకి వెళ్తే పారిశ్రామక ప్రాంతం గాజువాక శ్రీనగర్‌ లో సాలపు లీలావతి ఒంటరిగా నివాసం ఉంటున్నారు.

ఆమె భర్త గోపి హెచ్‌పీసీఎల్‌ రిటైర్డు ఉద్యోగి. కొన్ని రోజుల క్రితం ఆయన చనిపోయారు. ఇద్దరు ఆడపిల్లలకు వివాహం కావడంతో ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. ప్రస్తుతం ఒంటరిగా వుంటున్న ఆమె కొద్ది నెలల కిందట ఇంటి పన్ను చెల్లించేందుకు గాజువాక జోనల్‌ కార్యాలయానికి వెళ్లినప్పుడు ఇమంది నాగభూషణరావు మాటా మాటా కలిపి ఆమె వివరాలను తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో గాజువాకలో ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు లీలావతి చెప్పగా తాను చూసి పెడతానంటూ, ఆమె వెంట ఇంటికి వెళ్లి ఆర్థిక స్థితిగతులపై ఆరా తీశాడు.

భర్త పదవీ విరమణ అనంతరం వచ్చిన నగదును లీలావతి బ్యాంకులో దాచినట్టు గ్రహించాడు. లీలావతి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇంటి కోసం అంటూ దఫదఫాలుగా బ్యాంకుకు తీసుకుని వెళ్లి రూ.24,94,500 విత్‌ డ్రా చేయించి తీసుకున్నాడు. ఈ క్రమంలో రూ.ఐదు లక్షల విలువ చేసే ఎస్‌బీఐ బాండ్లు, 560 గ్రాముల బంగారం, ఆరు కిలోల వెండి ఆభరణాలు, ఓ ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌...ఇలా మొత్తం సుమారు కోటి రూపాయల విలువైన సొత్తు కాజేశాడు. నగదు తీసుకుని ఇల్లు కొనుగోలు విషయమై అడిగితే ముఖం చాటేయడంతో బాధితురాలు లీలావతి గాజువాక పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు నిందితుడి కోసం గొంతినవానిపాలెంలో గల అతడి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇమంది నాగభూషణ రావుతో పాటు  అక్కడ వున్న గొంతిన రమణమ్మ ను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. లీలావతి నుంచి తీసుకున్న నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఇతర వస్తువులన్నీ రమణమ్మ ఇంట్లో పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వృద్ధురాలిని మోసం చేసిన నాగభూషణరావుతో పాటు రమణమ్మను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోటి రూపాయల విలువైన సొత్తుకుగాను రూ.60,77,500 విలువైన సొత్తును నిందితుడి వద్ద నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.