దారుణం : భార్యని చంపి మంచం కింద దాచి, అదే మంచమెక్కి భర్త సూసైడ్ ?

దారుణం : భార్యని చంపి మంచం కింద దాచి, అదే మంచమెక్కి భర్త సూసైడ్ ?

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ నెక్నాంపూర్ లో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేసి ఆపై తనూ ఫ్యాన్ కి వైర్ తో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెలితే ఆంధ్రప్రదేశ్ కాకినాడ కు చెందిన రమణ, రత్నకుమారి దంపతులు గత రెండు సంవత్సరాల క్రితం పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ వచ్చారు. హైద్రాబాద్ లోని మణికొండ మున్సిపల్ పరిధిలోని నెక్నాంపూర్ లో నివాసం ఉంటున్నారు. రమణకు డ్రైవింగ్ తెలుసు కాబట్టి......స్థానికంగా జైపాల్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన వాటర్ ట్యాంకర్ నడుపుతున్నారు. భార్య రత్నకుమారి స్థానికంగా కాలనీలో ఇండ్లలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే రమణ తప్ప తాగి తరుచూ గొడవ పడేవారు. గత 15 సంవత్సరాల క్రితం రత్నకుమారి ని వివాహం చేసుకున్న రమణకు ఇప్పటి వరకు సంతానం కాలేదు. 

డ్యూటీ ముగించుకుని రమణ నేరుగా వైన్స్ దుకాణం కి వెళ్లి ఫుల్ గా మద్యం సేవించి ఇంటికి వచ్చే వాడు. తాగిన మైకంలో భార్య రత్నకుమారి తో గొడవకు దిగేవాడు. ఇద్దరి మధ్య గొడవ కాస్త చేయి చేసుకునే పరిస్థితికి వచ్చేది. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా భార్య తో గొడవకు దిగడం మొదలు పెట్టాడు. భార్య మాత్రం నీవు తాగడం మానేయాలి అంటూ తనతో గొడవకు దిగేది. గత 15 సంవత్సరాలుగా పిల్లలు కాకపోవడంతో కూడా ఇద్దరి మధ్య తరచూ గొడవ జరిగేదని సమాచారం. నిన్న ఫుల్ గా మద్యం సేవించి ఇంటికి వచ్చిన రమణ భార్య తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన రమణ భార్య పై దాడికి దిగాడు. క్షణికావేశంలో భార్యను చితకబాదాడు. మద్యం మత్తులో ఏమి చేస్తున్నాడో తెలియక భార్య గొంతు నులిమి తలను బలంగా బండకేసి మోదాడు. దీంతో రత్నకుమారి అక్కడే ప్రాణాలు విడిచింది. భార్య చనిపోయిన విషయాన్ని గమనించిన రమణ మృతదేహాన్ని మంచం కింద దాచిపెట్టి తాను ఫ్యానుకు వైర్ తో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ ఉదయం ఎంతకీ డ్యూటికి రాకపోవడంతో జైపాల్ రెడ్డి రమణకు ఫోన్ చేసాడు. ఎంతకీ ఫోన్ లేపకపోవడంతో ఇంటికి వచ్చి తలుపులు తట్టాడు. ఉలుకు పలుకు లేదు. గంట పాటు తలుపులు తట్టిన జైపాల్ రెడ్డి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు......తలుపులు పగలగొట్టి లోపలి వెళ్ళగా ఫ్యాన్ కు వేలాడుతూ రమణ కనిపించాడు. మంచం కింది భార్య రత్నకుమారి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. ఇద్దరి మృతిపై పలు అనుమానాలు వుండడంతో క్లూస్ టీమ్ బృందాలు రంగంలోకి దిగాయి. హత్య జరిగిన తీరు ఆత్మహత్య చేసుకున్న తీరును పరిశీలించి పలు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన నార్సింగీ పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు, పిల్లలు పుట్టకపోవడం తోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.