టిక్ టాక్ రచ్చ...భార్య గొంతుపిసికి హత్య చేసిన భర్త

టిక్ టాక్ రచ్చ...భార్య గొంతుపిసికి హత్య చేసిన భర్త

టిక్‌ టాక్‌ తో జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. టిక్ టాక్ ద్వారా ఎంతమంది ప్రతిభకు గుర్తింపు వచ్చిందో తెలియదు కానీ అనేక కుటుంబాలు మాత్రం విచ్ఛిన్నమవుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలోని జవహర్‌లాల్ వీధిలో గత నెల 27న ఫాతిమా అనే మహిళ హత్యకు గురయింది. తొలుత ఆమెది ఆత్మహత్యగా భావించారు. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని తన భార్య ఆత్మహత్య చేసుకుందని ఫాతిమా భర్త అందరికీ చెప్పాడు. అయితే ఫాతిమా తల్లి కూతురి మృతిపై చేసిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అసలు నిజం కనిపెట్టారు. ఫాతిమా తరచూ టిక్‌ టాక్‌లో వీడియోలు చేస్తుండేది.

అవి మానుకోవాలని భర్త ఎన్నిసార్లు చెప్పినా ఫాతిమా పట్టించుకోలేదు. ఈ క్రమంలో భర్తకు భార్యపై అనుమానం కలిగింది. టిక్ టాక్ వీడియోల ప్రభావంతో భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానించాడు. ఎన్నిసార్లు చెప్పినా వీడియోలు చేయడం ఆపకపోవడంతో భార్యపై  అతనికి అంతకంతకూ అనుమానం పెరిగిపోయింది. గత నెల 27న ఇది వాళ్లిద్దరి మధ్యా ఘర్షణకు దారితీసింది. కోపంతో చపాతీ కర్ర తీసుకుని ఫాతిమా తలపై కొట్టిన భర్త అంతటితో ఆగకుండా గొంతు నులిమి చంపేశాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని ఫ్యాన్ కు వేలాడదీసి ఆత్మహత్య చేసుకుని చనిపోయందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసు విచారణలో చిన పాచ్చూ నేరం అంగీకరించాడు.