బాబుకు మోహన్‌బాబు వార్నింగ్..! నా మనసును గాయపరిచావు...

బాబుకు మోహన్‌బాబు వార్నింగ్..! నా మనసును గాయపరిచావు...

సోషల్ మీడియా వేదికగా ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు.. క్రమశిక్షణ విషయంలో చంద్రబాబు తన పేరు ప్రస్తావించడాన్ని తప్పుబట్టిన మోహన్ బాబు.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, ఇటీవల జరిగిన టీడీపీ నేతల సమావేశంలో క్రమశిక్షణతో మెలగాలని సూచించిన చంద్రబాబు.. తనకు సన్నిహితుడైన మోహన్‌బాబునే సస్పెండ్ చేశానని గుర్తు చెప్పుకొచ్చారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మోహన్ బాబు.. చంద్రబాబుపై మండిపడుతూ వరుస ట్వీట్లు చేశారు. 

"చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతా ప్రశాంత వాతావరణం. ఈ సమయంలో మళ్ళీ ఇలా నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదు. రెండు రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటి నుండి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది." అంటూ బాబు కౌంటర్ ఇచ్చిన మోహన్ బాబు... "నా మనసును గాయపరిచావు. అన్న యన్.టి.ఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు నా సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మోహన్ బాబు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు, చెప్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే."నని మరో ట్వీట్ చేశారు.. ఇక, "క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే. దయ చేసి ఏ సందర్భంలోనూ నా పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించకు. అది నీకు నాకు మంచిది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందాం, అదీ నీకు ఇష్టమైతే. ఉంటా!" అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.