బీజేపీ ఓట్లను బట్టి గ్రామాలకు 'ఏబీసీడీ' గ్రేడింగ్ ఇచ్చిన మేనకా గాంధీ

బీజేపీ ఓట్లను బట్టి గ్రామాలకు 'ఏబీసీడీ' గ్రేడింగ్ ఇచ్చిన మేనకా గాంధీ

ఒక వివాదం నుంచి ఇంకా పూర్తిగా బయట పడలేదు, మేనకా గాంధీ మరో పెను వివాదం సృష్టించారు. తన కుమారుడు వరుణ్ గాంధీ పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ నియోజకవర్గంలో బీజేపీకి ఉన్న ఓట్లను బట్టి గ్రామాలకు మేనకా 'ఏబీసీడీ' గ్రేడింగ్ ఇవ్వాలని భావిస్తున్నారు. తనకు వచ్చే ఓట్లని బట్టి గ్రామాలకు ఏబీసీడీ గ్రేడింగ్ లు ఇచ్చి ఆ క్రమాన్ని అనుసరించి అభివృద్ధిలో ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం ఈ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మేనకా గాంధీ, ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ 'మేం ప్రతిసారీ పిలిభిత్ లో గెలుస్తాం. మేం ఒక గ్రామం కోసం ఎక్కువగా పనిచేశాం. మరో ఊరిని తక్కువ చూశాం అనేందుకు ప్రమాణం ఏంటి? అందువల్ల అన్ని గ్రామాలను ఏ, బీ, సీ, డీ అని వర్గీకరిస్తాం. మాకు 80 శాతం ఓట్లు వచ్చిన గ్రామం ఏ, 60 శాతం ఓట్లు వచ్చిన ఊరు బీ, 50 శాతం వచ్చిన గ్రామం సీ, 50 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చిన ఊరు డీగా విభజిస్తాం. అభివృద్ధి పనులు ముందుగా ఏ కేటగిరీ గ్రామాల్లో జరుగుతాయి. ఆ తర్వాత బీలో. బీలో పనులు పూర్తయ్యాక సీలో ప్రారంభిస్తాం. అందువల్ల మీరు మీ గ్రామాన్ని ఏ,బీ,సీలలో ఎక్కడ చూడాలనుకుంటారో మీ ఇష్టం. ఎవరూ డీ కేటగిరీలో ఉండకూడదు. ఎందుకంటే మేమంతా మంచి చేయడానికే వచ్చాం' అని మేనకాగాంధీ వ్యాఖ్యానించినట్టు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.