తెలంగాణ‌లో అధికారంలోకి రావాలి.. సోనియాకు గిఫ్ట్‌గా ఇవ్వాలి..

తెలంగాణ‌లో అధికారంలోకి రావాలి.. సోనియాకు గిఫ్ట్‌గా ఇవ్వాలి..

తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది...  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలి అని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ మనిక్కమ్ ఠాగూర్.. హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన‌ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ఆయ‌న పార్టీ నేత‌ల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు.. మనమంతా టీమ్ వర్క్ చేస్తే రాబోయే ఎన్నిక‌ల్లో విజయం సాధిస్తాం.. క్రమశిక్షణ, కలిసి ఐక్యంగా పనిచేయడం చాలా ముఖ్య‌మ‌న్న ఆయ‌న‌.. ప్రతి నెలలో రెండు సార్లు తప్పకుండా కోర్‌ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామ‌న్నారు.  అన్ని విషయాలు చర్చించుకుందాం.. రాబోయే రోజుల్లో నిరంతరం క్షేత్ర స్థాయి ఉద్యమాలు చేయాల‌ని.. నిరంతరం ప్రజల్లో ఉండాలి అని సూచించారు. 

ఇక‌, భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను కూడా ప్ర‌క‌టించారు మనిక్కమ్ ఠాగూర్.. సెప్టెంబర్ 28న గవర్నర్‌కు వినతిపత్రాన్ని అంద‌జేయాల‌ని సూచించిన ఆయ‌న‌.. అక్టోబర్ 2వ తేదీ న రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్, మాజ్దూర్ బచావో దినంగా పాటించాల‌న్నారు. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది రైతులు, వ్యవసాయ కార్మికులతో సంతకాల సేకరణ చేయించాల‌న్న‌ది పార్టీ పిలుపుగా తెలిపారు. కేసీఆర్ వ్య‌వ‌సాయ బిల్లుల విషయంలో తెలివిగా ఆటలాడుతున్నార‌ని మండిప‌డ్డారు మనిక్కమ్ ఠాగూర్. అన్ని బిల్లుల విషయంలో అందరికంటే ముందుగానే బీజేపీకి, మోడీకి మద్దతు ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుడు వ్య‌వ‌సాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నార‌ని గుర్తుచేశారు. మనం రైతుల పక్షాన పెద్దఎత్తున పోరాటం చేయాలి.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది... కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాల‌న్నారు.