ఉన్నతాధికారులు.. చెత్త పర్ఫామెన్సూ

ఉన్నతాధికారులు.. చెత్త పర్ఫామెన్సూ

ఓ వస్తువు మార్కెట్లోకి విడుదలయ్యే ముందే అనేక పరీక్షకలకు గురి చేస్తారు. వాటన్నింటినీ తట్టుకుని పర్ఫామెన్స్ చూపినప్పుడే ఐటమ్ ని ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. వస్తువులకైనా, మనుషులకైనా ఇదే సూత్రం. ఈ క్రమంలోనే త్వరలో ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్ లో.. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ కసరత్తులు మొదలుపెట్టింది. ఆ రాష్ట్రంలోని ఉన్నతాధికారులకు ఎన్నికల చట్టాలు, ఎన్నికల నిర్వహణపై టెస్ట్ పెట్టింది. వారికి అవగాహన కూడా కల్పించారు. ఆ తరువాత ఆగస్టు 18న పరీక్ష నిర్వహించారు. అయితే ఆ పరీక్షలో 58 శాతం మంది ఫెయిలయ్యారు. హాజరైన 561 మందిలో 238 మంది పూర్ పర్ఫామెన్స్ చూపించారు. పరీక్షకు హాజరైనవారిలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్స్, అదనపు జిల్లా మెజిస్ట్రేట్స్, రెవెన్యూ అధికారులు ఉన్నారు. 

ఫెయిలైన అధికారులకే గాక అందరికీ కలిపి మరో దఫా శిక్షణ తరగతులు పెట్టాలని మధ్యప్రదేశ్ సీఈవో వీఎల్ కాంతారావు చెబుతున్నారు. అయితే ఇంత పూర్ పర్ఫామెన్స్ ఎందుకు వచ్చిందని ఆరా తీస్తే.. అధికారులు ప్రిపేర్ కావాల్సినంతగా కాలేదని, పరీక్ష నిర్వహించిన తీరులో కూడా లోపాలున్నాయని, అధికారులకు ఏ తరహాలో ప్రశ్నలు అడగాలో అడగలేదని, వారు ప్రతి అంశాన్ని బడిపిల్లల మాదిరిగా బట్టీ పట్టాల్సిన అవసరం లేదని కాంతారావు చెప్పుకొచ్చారు. ఎన్నికలకు సంబంధించి అవసరమైన చట్టాలపై అవగాహనతో పాటు క్రాస్ చెక్ చేసుకునే నేర్పు ఉంటే సరిపోతుందన్నారు. 

మరోవైపు ఆ టెస్టు పాసవ్వడానికి 70 శాతం కటాఫ్ మార్కులుగా పెట్టడం కూడా ఫెయిల్యూర్ కు మరో కారణమన్న అభిప్రాయాలున్నాయి. అయితే అంతా చదువుకున్నవారు, ప్రభుత్వ పాలనలో చురుకైన పాత్ర పోషిస్తున్నవారు అయినప్పుడు 70 శాతం ఎందుకుండాలి.. 90-95 శాతం స్కోర్ ను కటాఫ్ గా పెట్టాలన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించేలా శిక్షణనిచ్చేందుకు ఈసీ.. ఇండియా ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్ మెంట్ (ఐఐఐడీఈఎం) ని ఏర్పాటు చేసింది.