ఫేస్‌బుక్‌కు షాక్‌.. 7.2 బిలియన్‌ డాలర్ల నష్టం

ఫేస్‌బుక్‌కు షాక్‌.. 7.2 బిలియన్‌ డాలర్ల నష్టం

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ 7.2 బిలియన్‌ డాలర్ల ఆదాయం నష్టపోయారు. ఫేస్‌బుక్‌ నుంచి కొన్ని  కంపెనీలు ప్రకటనలు విరమించుకోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు శుక్రవారం ఏకంగా 8.3 శాతం నష్టపోయాయి. ప్రపంచంలోనే అెతిపెద్ద ప్రకటనదారైన యూనిలివర్‌ సంస్థ సోషల్‌ నెట్‌వర్క్‌లో ప్రకటనలు ఇవ్వడాన్ని బహిష్కరించింది. ఇదే దారిలో నడుస్తున్న వెరిజాన్‌ కమ్యూనికేషన్స్‌, హెర్షె కో కంపెనీలతో జత కలిసింది. ఈ ఏడాది ఫేస్‌బుక్‌ ప్రాపర్టీల్లో ఖర్చుచేయడం తగ్గిస్తామని  వెల్లడించింది.  అయితే, నెల రోజులుగా కోకాకోలా సైతం సోషల్‌ నెట్‌వర్కుల్లో ప్రకటనలు ఇవ్వడం మానేసింది.

ఫేస్‌బుక్‌ షేర్ల ధరలు తగ్గడంతో ఆ కంపెనీ మార్కెట్‌ విలువ 56 బిలియన్‌ డాలర్ల మేర తగ్గిపోయింది. జుకర్‌బర్గ్‌ సంపద 82.3 బిలియన్‌  డాలర్లకు పడిపోవడంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన స్థానం మూడు నుంచి నాలుగుకు మారింది. లూయిస్‌ విటన్‌ అధినేత  బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌  మూడో స్థానానికి ఎగబాకారు. జెఫ్‌ బెజోస్‌, బిల్‌గేట్స్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.  ఫేస్‌బుక్‌లో తప్పుడు సమాచారం వస్తోందని విమర్శలు రావడంపై జుకర్‌బర్గ్ ‌స్పందించారు. వర్ణ వివక్ష, విద్వేష వ్యాఖ్యలు  నిలువరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక నుంచి తాను ప్రకటించే విధానాల్లో రాజకీయ నాయకులకూ మినహాయింపు  ఉండదని స్పష్టంచేశారు. ఒక బిలియన్‌కు సుమారు 7 వేల కోట్లు మారకంగా తీసుకున్నా జుకర్‌బర్గ్‌కు కనీసం 50 వేల కోట్ల నష్టం  వాటిల్లినట్టే!