ఎన్నికలంటే మాకేమీ భయం లేదు...

ఎన్నికలంటే మాకేమీ భయం లేదు...

ఎన్నికలంటే మాకేమీ భయం లేదు.. భయపడాల్సిన అవసరం కూడా లేదు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ... సుప్రీం కోర్టులో ఒకటి, రెండు రోజులలో పిటిషన్ దాఖలు చేస్తాం. న్యాయం గెలుస్తుందనే నమ్మకం నాకు ఉందన్నారు. అసలు ఓటర్ల జాబితాలే సిద్దం కాకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? అని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాలు సిద్దం కాకుండా ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశమే లేదు.. అది చంద్రబాబు ప్రభుత్వం రద్దయినప్పుడు రుజువైందని తెలిపారు. ఈ తప్పులతడకల ఓటర్ల జాబితాల రూపకల్పనలో మొదటి కుట్రదారుడు కేసీఆర్, రెండవ కుట్రదారుడు బన్వర్ లాల్, మూడవ కుట్రదారుడు లోమేష్ కుమార్ అని శశిధర్ రెడ్డి అన్నారు. ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలను, అభ్యర్థనలను తెలియజేసేందుకు సెప్టెంబరు 25 వరకు ఇచ్చిన సమయం ఏమాత్రం సరిపోదన్నారు.

అవకతవకలతో కూడిన ఓటర్ల జాబితాలను 4 నెలలో సరిచేయడం కష్ట సాధ్యం.. ఇక 4 వారాలలో సరిచేయడం ఖచ్చితంగా అసాధ్యం అని శశిధర్ రెడ్డి అన్నారు. చట్టసభల రెండు సమావేశాల మద్య సమయం 6 నెలలకు మించకూడదు. ఎన్నికల నిర్వహణలో ఈ నిబంధన కేంద్ర ఎన్నికల సంఘంకు వర్తించదు. మా వాదనలన్నీ సుప్రీం ధర్మాసనం ముందు వినిపిస్తాం అని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. విషయ తీవ్రతను గ్రహించినా, గ్రహించనట్లుగా ఉన్నారా.. లేకపోతే అతి తెలివిని ప్రదర్శిస్తున్నారా? అని మండిపడ్డారు. శక్తివంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థను రూపొందించాలంటే సరైన రీతిలో ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం ఖచ్చితత్వంతో వ్యవహరించాలన్నారు.