కలిసి ఉంటే గుండెజబ్బులు దూరం

కలిసి ఉంటే గుండెజబ్బులు దూరం

కోపం వచ్చినపుడు పెళ్లంటే నూరేళ్ల పంట కాదు.. నూరేళ్ల మంట అని అనిపించవచ్చు. కానీ ఒంటరిగా ఉంటే గుండెకు తంటా అని.. వృద్ధాప్యంలో జీవిత భాగస్వామితో కలిసి ఉంటే గుండెజబ్బు, గుండెపోటు వంటివి దరిజేరవని అంటున్నారు పరిశోధకులు. ఇది ఇంటర్నెట్ పోల్, ఇతరత్రా మార్గాల్లో చేసిన హడావిడి పరిశోధన కాదు.. రెండు దశాబ్దాలకు పైగా సమయంలో 2 మిలియన్లకు పైగా 42 నుంచి 77 ఏళ్ల వయసున్న వారిని పరిశీలించి పరిశోధించి కనిపెట్టామని చెబుతున్నారు.

20 ఏళ్లకు పైగా జరిపిన పరిశోధన.. 20 లక్షల మందికి పైగా శాంపిల్.. ప్రపంచవ్యాప్తంగా యూరప్, ఉత్తర అమెరికా, మధ్య ఆసియా, ఆసియా ఖండాలలోని వివిధ సముదాయాలలో పరిశోధన.. గుండెజబ్బులకు కారణాలు, వాటి నివారణోపాయాలు కనిపెట్టేందుకు పరిశోధకులు సుదీర్ఘ కాలంపాటు జరిపిన రీసెర్చిలో అబ్బురపరిచే ఫలితాలు వచ్చాయి. విడాకులు తీసుకున్నవారు, జీవిత భాగస్వామిని కోల్పోయినవారు, అవివాహితులతో పోలిస్తే జీవిత భాగస్వామితో కలిసి కాపురం చేస్తున్నవారికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు 42 శాతం తక్కువ. వారికి కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాలు 16 శాతం మేర తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు.

అవివాహితుల్లో కరోనరీ హార్ట్ డిసీజ్ బాధితులు 42%, గుండెపోటు బాధితులు 55% ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. ఈ ఫలితాలు పురుషులు, మహిళల్లో దాదాపుగా సరిసమానంగా ఉన్నాయి. పురుషుల్లో గుండెపోటు బాధితులు ఎక్కువగా ఉన్నారు. వయసు పైబడటం, అధిక రక్తపోటు, అధిక కొలెస్టరాల్, పొగ తాగడం, డయాబెటిస్ వంటి అలవాట్ల కారణంగా పురుషులకు హృదయసంబంధ వ్యాధులు అధికంగా ఉన్నట్టు భావిస్తున్నారు. మిగతా 20 శాతం వివాహ బంధంతో ముడిపడినట్టు చెబుతున్నారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తీసుకొనే శ్రద్ధ గుండెకు రక్షణ కవచంగా మారుతుందని అంటున్నారు. 

Photo: Fileshot