నెక్సా ద్వారానే ఎలక్ట్రిక్ కార్ల అమ్మకం

నెక్సా ద్వారానే ఎలక్ట్రిక్ కార్ల అమ్మకం

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన వినియోగదారులకు అత్యద్భుతమైన అనుభూతిని కల్పించేందుకు దేశవ్యాప్తంగా నెక్సా డీలర్ షిప్ లను ప్రారంభించింది. ఇప్పుడు కంపెనీ త్వరలో విడుదల చేయబోయే తన ఎలక్ట్రిక్ కార్ పోర్ట్ ఫోలియోని కూడా నెక్సా డీలర్ షిప్ లకే ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. మారుతి సుజుకి దేశవ్యాప్తంగా నెక్సా డీలర్ షిప్ లు ప్రారంభించిన ఐదేళ్లవుతోంది. ఇప్పటి వరకు కంపెనీకి 250కి పైగా డీలర్ షిప్ లు ఉన్నాయి. 2019 చివరి నాటికి 300 సర్వీస్ ఔట్ లెట్లు ప్రారంభించాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. నెక్సా బ్రాండ్ పట్ల కంపెనీ ఎంత శ్రద్ధ పెడుతోందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. మారుతి సుజుకీ తన మొదటి ఎలక్ట్రిక్ కారును 2020లో విడుదల చేయాలని భావిస్తోంది. తన పోర్ట్ ఫోలియోలో ఈవీ కార్లను చేర్చుకొనడానికి ముందుగా కంపెనీ తన నెట్ వర్క్ విస్తరణ ప్రారంభించింది.

మారుతి సుజుకి ఇప్పటికే భారత్ లో వేగన్ ఆర్ పై ఎలక్ట్రిక్ కార్ పరీక్షించి చూసింది. 2020 నుంచి లిథియం ఇయాన్ బ్యాటరీలు తయారు చేస్తామని, అందుకోసం ఒక బ్యాటరీ ప్లాంట్ స్థాపిస్తామని ప్రకటించింది. భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల పరీక్షకు 2018 వేగన్ ఆర్ మోడల్ ను మారుతి సుజుకి ఉపయోగిస్తోంది. భారత్ లో విడుదల చేసే కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ కారు కూడా అదే అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల కార్యక్రమాన్ని టొయోటా మోటార్ కార్పొరేషన్ సహాయ సహకారాలతో నిర్వహిస్తారు. ఈ మేరకు మారుతి సుజుకీకి టొయోటాకి మధ్య వెహికిల్ షేరింగ్ జాయింట్ వెంచర్ కుదిరింది.

ప్రీమియం వాహనాలుగా మార్కెట్లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్ ఫోలియోకి నెక్సా డీలర్ షిప్ ను ఎంచుకోవడంలో ఆశ్చర్యమేం లేదు. ఎలక్ట్రిక్ కార్ ధర రూ.8 లక్షల పైచిలుకే కావచ్చని భావిస్తున్నారు. ఈ ధరను చూస్తే వినియోగదారులు కూడా అత్యద్భుత అనుభూతిని ఆశిస్తారని భావించిన మారుతి సుజుకీ ఇందుకోసం నెక్సా డీలర్ షిప్ ల ద్వారా పంపిణీ చేయాలని భావిస్తోంది.