ఆల్టోని ఓవర్ టేక్ చేసిన డిజైర్

ఆల్టోని ఓవర్ టేక్ చేసిన డిజైర్

చాలా కాలంగా దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కారుగా మారుతి సుజుకికి చెందిన ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ కారు ఆల్టో గుర్తింపు పొందింది. కానీ జూలై 2018లో ఆల్టో ఘనత మారుతి సుజుకికే చెందిన కొత్త కాంపాక్ట్ సెడాన్ డిజైర్ చేజిక్కించుకొంది. జూలైలో డిజైర్ మోడల్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా రికార్డుల కెక్కింది. 

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం జూలైలో డిజైర్ 25,647 యూనిట్లు అమ్ముడయ్యాయి. కిందటేడాది ఇదే నెలకు డిజైర్ 14,703 యూనిట్లే అమ్ముడుపోయాయి. అప్పుడు డిజైర్ టాప్ సెల్లింగ్ కార్లలో ఐదో స్థానంలో నిలిచింది. జూలైలో ఆల్టో 23,371 యూనిట్లు మాత్రమే సేలయ్యాయి. దీంతో ఆల్టో మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది. 

జూలైలో మారుతి సుజుకికి చెందిన మరో మోడల్ స్విఫ్ట్ 19,993 యూనిట్లు అమ్ముడై మూడో స్థానాన్ని సాధించింది. కిందటేడాది ఇదే సమయానికి స్విఫ్ట్ 13,738 కార్లతో టాప్ సెల్లింగ్ కార్లలో ఆరో స్థానం దక్కించుకొంది. 17,960 యూనిట్ల అమ్మకాలతో మారుతి బెలనో నాలుగో స్థానంలో నిలిచింది. 

తాజా వివరాల ప్రకారం హ్యుండై మోటార్స్ దేశంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా తన స్థానం నిలుపుకొంది. హ్యుండైకి చెందిన మూడు మోడళ్లు ఎలిట్ ఐ20, గ్రాండ్ ఐ10, క్రెటా టాప్ 10 సెల్లర్లలో 7, 8, 9 స్థానాల్లో నిలిచాయి. హోండాకి చెందిన అమేజ్ అమ్మకాలు బాగా మెరుగుదల కనిపించింది. ఆ మోడల్ కి 10వ స్థానం దక్కింది.