అసలు మసూద్ అజార్‌ను పాక్‌కు అప్పగించిందెవరు?

అసలు మసూద్ అజార్‌ను పాక్‌కు అప్పగించిందెవరు?

తమవల్లే జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించారని చెప్పుకుంటున్న బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసలు మసూద్ అజార్ అనే తీవ్రవాదని పాకిస్థాన్‌కు అప్పగించిందెవరని ప్రశ్నించారు. ఉగ్రవాదంపై రాజీపడింది బీజేపీయేనని మండిపడ్డ రాహుల్... కందహార్ ఘటనను గుర్తుచేశారు. కాందహార్ ఘటన తర్వాత మసూద్‌ను పాకిస్థాన్‌కు ఎందుకు పంపించారు? అని నిలదీశారు. మసూద్‌ను పాక్‌కు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ కాదు.. బీజేపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. మసూద్ అజార్‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయంలో ఎందుకు పాక్‌కు అప్పగించారు? ఎవరికి భయపడి ఆ నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు విడుదల చేశారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖామని.. మోడీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఆరోపించారు రాహుల్. జీఎస్టీతో చిన్న వ్యాపార సంస్థలు కుదేలయ్యాయన్నారు. నోట్ల రద్దు లాంటి అనాలోచిత నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మోడీ.. అధికారంలోకి వచ్చిన తరవాత ఆ ఊసే ఎత్తలేదన్నారు. ఉద్యోగాల విషయంలో ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు రాహుల్. 

ఇక ఆయన ఎప్పటికీ ‘చౌకీదార్‌ ఛోర్‌ హై’ అని వ్యాఖ్యానించారు. చౌకీదార్ ఛోర్‌ హై వ్యాఖ్యల దుమారంపై స్పందించిన రాహుల్... సుప్రీంకోర్టుకు ఆపాదిస్తూ చేసిన వ్యాఖ్యలకు మాత్రమే తాను క్షమాపణలు చెప్పానని.. మోడీకో లేదా బీజేపీకో కాదని స్పష్టం చేశారు. ‘చౌకీదార్‌ ఛోర్‌ హై’ అనే నినాదం మాత్రం వదిలేది లేదు... కొనసాగిస్తామని ప్రకటించారు.  కాంగ్రెస్‌ మేనిఫెస్టో నాయకులు రూపొందించిన పత్రం కాదని.. అది ప్రజల గళాన్ని వినిపిస్తోందని వ్యాఖ్యానించారు. రైతులను సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ప్రత్యేక పథకాలు రూపొందించామన్నారు. నరేంద్ర మోఢీ హయాంలో కుదేలైన దేశ ఆర్థిక రంగం కనీస ఆదాయ పథకం ‘న్యాయ్‌’తో ఊపందుకుంటుందన్నారు. మరోవైపు సైన్యాన్ని ప్రధాని అవమానించారని మండిపడ్డారు రాహుల్... యూపీఏ హాయాంలో జరిగిన సర్జికల్ దాడులపై సందేహాలు వ్యక్తం చేసిన మోడీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇది సైన్యాన్ని అవమానించడమేనని విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీ అనుకుంటున్నట్టు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఎవరి సొత్తూ కాదు. యూపీఏ హయాంలో జరిగిన సర్జికల్ దాడులు వీడియో గేమ్‌లలో జరిగాయని ప్రధాని చెప్పారంటే, అది కాంగ్రెస్‌ను అవమానం కాదు... సైనిక దళాలను అవమానించినట్టు. ఈ వైమానిక దాడులు చేసింది సైన్యం. అయితే మేం సైన్యానికి రాజకీయాలు ఆపాదించలేదు. ప్రధాని ఈ విధంగా సైన్యాన్ని అవమానించకూడదంటూ హితవు పలికారు రాహుల్ గాంధీ.