ఆర్మీ ఆస్పత్రి నుంచే మసూద్ ఆదేశాలు

ఆర్మీ ఆస్పత్రి నుంచే మసూద్ ఆదేశాలు

పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడ్డ జైషే మహమ్మద్ చీఫ్‌ మసూద్ అజర్ తన సభ్యులకు ముందుగానే సూచనలు ఇచ్చినట్లు తెలుస్తుంది. పాకిస్థాన్‌లోని  రావల్పిండి ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మసూద్‌ అక్కడి నుంచే ఈ ఆదేశాలు ఇచ్చినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. గత నాలుగు నెలలుగా అనారోగ్య కారణాలతో మసూద్‌‌ అక్కడ చికిత్స పొందుతున్నట్లు సమాచారం. యునైటెడ్‌ జిహద్‌ కౌన్సిల్‌(యూజేసీ) నిర్వహించిన గత ఆరు కీలక సమావేశాలకు మసూద్‌ హాజరుకాకపోవడం.. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని ధ్రువపరుస్తోంది. కేవలం 8 రోజుల ముందే ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులను సిద్ధం చేసినట్లు ఇంటెలిజెన్స్ సమాచారం. గతేడాది భద్రతా దళాల చేతిలో హతమైన తన మేనల్లుడు ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, ఈ యుద్ధంలో మరణం కన్నా సంతోషకరమైనది మరొకటి లేదంటూ ఆడియో టేపుల ద్వారా కశ్మీర్ యువతను రెచ్చగొట్టినట్లు బయటకు వచ్చింది. పుల్వామా దాడికి సంబంధించిన ప్రణాళికలను మసూద్ యూజేసీలోని ఇతర జిహాదీ గ్రూపులతో పంచుకోలేదని సమాచారం. ఆడియో టేపుల ద్వారా కశ్మీర్ లోయలో ఆత్మాహుతి దాడులు చేసే విధంగా అక్కడి యువతను రెచ్చగొట్టాలని తన మరో మేనల్లుడు మహమ్మద్ ఉమేర్, జైషే మాజీ కమాండర్ అబ్ధుల్ ఘాజీలకు మసూద్ రహస్య సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ని కారుతో ఢీకొట్టిన అబుల్ అహ్మద్ దార్‌కు ఘాజీనే శిక్షణ ఇచ్చినట్లుగా నిఘా వర్గాలు చెబుతున్నాయి.