భారీ అగ్నిప్రమాదం.. అదుపులోకిరాని మంటలు

భారీ అగ్నిప్రమాదం.. అదుపులోకిరాని మంటలు

డిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని మాలవీయ నగర్‌ ఖిర్కీ ఎక్స్‌టెన్షన్‌లో రబ్బర్‌ ఫ్యాక్టరీకి చెందిన గోదాంలో మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 80 అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపుచేసేందుకు యత్నించినా.. ఫలితం లేకపోయింది. దాదాపు 18 గంటలుగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నా మంటలు అదుపులోకి రాకపోవడంతో.. ఈ రోజు ఉదయం హెలికాప్టర్‌ ద్వారా నీటిని చల్లుతూ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం పక్కనే ఓ పాఠశాల, నివాస గృహాలు ఉన్నాయి. ఈ సమయంలో పాఠశాలలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ముందు జాగ్రత్త చర్యగా నివాస గృహాలలోని ప్రజలను కూడా ఖాళీ చేయించారు అధికారులు. గోదాంలో ఉన్న ఓ వాహనంలో మొదట మంటలు చెలరేగి.. ఆపై మొత్తం వ్యాపించినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో గోదాంలోని ప్లాస్టిక్‌, ఇతర ముడి పదార్థాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

Photo: FileShot