ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం, బస్సులు దగ్ధం...

ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం, బస్సులు దగ్ధం...

వరంగల్‌ ఆర్టీసీ డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది... వరంగల్ ఆర్టీసీ డిపో-1లో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఐదు ఆర్టీసీ బస్సులు దగ్ధమయ్యాయి. షార్ట్‌సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్టు అధికారులు చెబతున్నారు. మరోవైపు ఈ ఘటనపై మంత్రి మహేందర్ రెడ్డి ఆరా తీశారు... విచారణకు ఆదేశించారు మంత్రి. ఇలాంటి ఘటనకు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు మంత్రి మహేందర్ రెడ్డి. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో డిపోలో అగ్నిప్రమాదం చోటుచేసుకుందంటున్నారు అధికారులు. ఓ బస్సులో చెలరేగిన మంటలు క్రమంగా పక్కనే ఉన్న బస్సులకు వ్యాపించడంతో ఐదు బస్సులు దగ్ధమయ్యాయి. అయితే డ్రైవర్లు వెంటనే అప్రమత్తమై మరిన్ని బస్సులను దూరంగా పెట్టడంతో భారీ ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.