భారీ వర్షాలతో వణికిపోయిన కోల్‌కత్తా

భారీ వర్షాలతో వణికిపోయిన కోల్‌కత్తా
నిన్న రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని కోల్‌కత్తా నగరం వణికిపోయింది. సుమారు 90 కి.మీల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచడంతో.. దాదాపు 26 ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలిపోయాయి. దీంతో నగరం అంతటా పూర్తిగా ట్రాఫిక్‌ స్తంభించింది. సుమారు రెండు గంటల పాటు మెట్రో ట్రైన్‌ సేవలు నిలిచిపోయాయి. బలమైన ఈదురుగాలుల ధాటికి నగరంలోని పలుచోట్ల చెట్లు కూలిపోవడం.. విద్యుత్‌ స్తంభాల వైర్లు తెగిపోయి జనాల మీద పడటంతో 10 మంది మృతి చెందారు. సుమారు 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరోవైపు బలమైన ఈదురు గాలులతో కూడిన తుపాను కారణంగా కోల్‌కత్తా నగరంలోని న్యూమార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ అయింది. దీంతో రాత్రంతా కరెంటు లేక తుపానులో ఇబ్బంది పడ్డారు పోలీసులు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో తుపాను రావడంతో ఉద్యోగులు ఇంటికి వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగర్ మున్సిపల్‌, పోలీస్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.