కొండెక్కిన కోడిగుడ్డు.. చికెన్‌ ధరలకు రెక్కలు..!

కొండెక్కిన కోడిగుడ్డు.. చికెన్‌ ధరలకు రెక్కలు..!

ఇది కరోనా కాలం.. కరోనా బారినపడకుండా ఉండాలంటే.. ఇమ్యూనిటీ పవర్ ఉండాల్సిందే.. భౌతికదూరం పాటిస్తూ, మాస్క్‌ ధరిస్తూ.. వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ.. ఇమ్యూనిటీని పెంచుకోవాలి.. అయితే, కరోనా కాలంలో జనం ఇమ్యూనిటీ పవర్‌ పెంచుకునేందుకు విపరీతంగా నాన్‌వెజ్‌ తింటున్నారు. ప్రొటిన్‌లు ఎక్కువగా లభించే గుడ్లు, చికెన్‌ ఎక్కువగా తినడంతో వీటికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీంతో చికెన్‌, గుడ్ల ధరలు ఆకాశనంటుతున్నాయి.. రెండు వారాలుగా పెరుగుతున్న ధరలు సామాన్యడికి చుక్కలు చూపిస్తున్నాయి.

మొన్నటి వరకు 150 రూపాయలు ఉన్న కేజీ చికెన్ ఇప్పుడు 250-280 రూపాయల వరకు పెరిగింది. కోడి గుడ్ల ధర కూడా ఒక్కోటి హోల్ సేల్ గా అయితే 6 రూపాయలు, రిటైల్‌గా రూ.7 వరకు పలుకుంది. అదే విధంగా డజను కోడి గుడ్లు ఎన్నడూ లేని విధంగా 165 రూపాయలకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. సాధారణంగా వేసవిలో చికెన్, కోడి గుడ్ల ధరలు పెరిగేవి... కానీ, వర్షా కాలంలో అన్ సీజన్‌లో కూడా నాన్ వెజ్ ధరలు పెరగడంతో అటు వ్యాపారాలు లేక విక్రయదారులు, ఇటు కొనుగోలు దారులు రెండు కేటగిరిలు వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుండి కోళ్లను దిగుమతి చేసుకోవాలంటే ఓ వైపు కరోనా భయం కూడా వెంటాడుతుండడంతో లిమిటెడ్ గానే దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని వ్యాపారులు అంటున్నారు. మొత్తానికి పెరుగుతున్న ధరలకు సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ధరలు పెరిగితే కొనేదెలా? తినేదెలా? అంటూ గగ్గోలు పెడుతున్నారు.