దాదాపుగా ఖరారైన మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు.. ఈసారి వారికే !

దాదాపుగా ఖరారైన మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు.. ఈసారి వారికే !

గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కొత్త పాలక వర్గం నేడు కొలువుదీరనుంది. నూతనంగా ఎన్నికైన పాలకవర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు అధికారులు. అవాంచనీయ ఘనటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నిక ప్రక్రియను పూర్తిగా వీడియో తీయించాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీచేసింది. ఉదయం 11 గంటలకు నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. బీజేపీకి చెందిన లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ఒకరు చనిపోవడంతో మొత్తం 149 మంది కార్పొరేటర్లు ఒక్కోక్కరుగా ప్రమాణ స్వీకారం చేచనున్నారు. అనంతరం హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నిక నిర్వహించనున్నారు.

కేవలం సభ్యులను మాత్రమే కౌన్సిల్ హాల్‌లోకి అనుమతించనున్నారు. సభ్యులు తప్పని సరిగా కోవిడ్‌ నిబంధనలను పాటిస్తు మాస్క్‌లను ధరించాలని సూచించారు. పార్టీల ప్రాతిపదికగా సభ్యులకు సీట్ల కేటాయింపు చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత 12గంటల 30నిమిషాలకు మొదటగా మేయర్, అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. చేతులు ఎత్తడం ద్వారా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియో రికార్డు చేయనున్నారు. మొత్తం 193 మంది సభ్యుల్లో 97 మంది సభ్యులు హాజరై.. కోరం ఉంటే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. లేకుంటే శుక్రవారానికి వాయిదా వేస్తారు.

ఆ రోజు కూడా ఎన్నిక జరగకుంటే.... ఎస్ఈసీ మరో తేదీని ప్రకటించే అవకాశముంది. బల్దియాలో ఏ పార్టీకి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు స్పష్టమైన మేజార్టీ లేకపోవడంతో ఎన్నికై ఉత్కంఠ సాగుతోంది. ఇక టీఆర్ ఎస్ నుండి హైదరాబాద్ మేయర్ అభ్యర్థిగా కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మోతె శ్రీలత శోభన్‌రెడ్డి దాదాపు ఖరారయ్యారు. బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా విజయలక్ష్మి రెండోసారి గెలవగా... మోతె శ్రీలత శోభన్‌రెడ్డి తార్నాక కార్పొరేటర్‌గా తొలిసారి గెలిచారు. బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థిగా రాధా ధీరజ్‌రెడ్డి బరిలోకి దిగగా... బీజేపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా రవి చారి పోటీ చేస్తున్నారు.