మేయర్‌ పీఠం ఎవరిది..ఎవరి బలాబలాలు ఎంత ?

మేయర్‌ పీఠం ఎవరిది..ఎవరి బలాబలాలు ఎంత ?

 

జీహెచ్ఎంసీ ఎన్నికల సమరంలో ప్రచారం హోరాహోరీగా జరిగింది. యుద్ధాన్ని తలపించేలా పార్టీలు తలపడ్డాయి. మరి గ్రేటర్‌ హైదరాబాద్ మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకోనున్నారు. అసలు మేయర్ పీఠం సొంతం చేసుకోవాలంటే ఏ ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించాలో చూద్దాం...  గ్రేటర్‌లో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఈ 150 డివిజన్లలో కార్పొరేటర్లను ప్రజలు ఎన్నుకోనున్నారు. మేయర్ ఎన్నిక  పరోక్ష పద్ధతిలో జరగనుంది. అంటే కార్పొరేటర్లు, గ్రేటర్‌ ఓటు హక్కు కలిగిన ఎక్స్‌ అఫీషియో సభ్యులు కలిసి మేయర్‌ను ఎన్నుకుంటారు. 150 కార్పొరేటర్ల పాటు.. నగరంలోని ప్రజాప్రతినిధులు... గవర్నర్‌ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలతో కలిసి మొత్తం 52 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులున్నారు. దీంతో మేయర్‌ ఎన్నికకు మొత్తం ఓట్ల సంఖ్య 202గా లెక్కతేలింది. అంటే మేయర్‌ పీఠం దక్కించుకోవాలంటే... 102 ఓట్ల బలం అవసరమవుతుంది.

 

మేయర్‌ ఎన్నికలో గ్రేటర్‌లో హైదరాబాద్ పరిధిలోని లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఓటుహక్కు కలిగి ఉంటారు. పార్టీలపరంగా బలాబలాలు పరిశీలిస్తే.. ముందుగా టీఆర్‌ఎస్‌ పార్టీనే తీసుకుంటే... ఆ పార్టీకి మొత్తం 37 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉన్నారు. ఇందులో లోక్‌సభ సభ్యులు.. కొత్త ప్రభాకర్‌రెడ్డి , రంజిత్‌ రెడ్డి .. ఇద్దరు ఓటు హక్కు కలిగి ఉన్నారు. రాజ్యసభ నుంచి కేకే, డి.శ్రీనివాస్‌ గ్రేటర్‌లో ఓటుహక్కు కలిగి ఉన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో.. టీఆర్‌ఎస్‌కు ఉన్న ఎమ్మెల్యేలు 17 మంది ఉన్నారు. ఇందులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టిఫెన్ సన్ కూడా ఉన్నారు. ఇక ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌ పార్టీకి 11మంది ఉండగా... ఐదుగురు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తంగా.. ఆ పార్టీకి 37 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యుల బలం ఉంది. టీఆర్‌ఎస్ మేయర్ పీఠం ఎక్కాలంటే... ఇంకా 65 డివిజన్లలో గెలవాల్సి ఉంటుంది. ఇక బీజేపీ బలాబలాలు ఒకసారి పరిశీలిస్తే... ముగ్గురు ఎక్స్‌ అఫీసియో సభ్యులున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కిషన్‌ రెడ్డికి గ్రేటర్‌లో ఓటుహక్కు ఉంది. అలాగే గోషామహల్‌ నుంచి ఎమ్మల్యేగా గెలిచిన రాజాసింగ్‌ , ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఓటు హక్కు కలిగి ఉన్నారు. కమలనాథులకు మూడు ఓట్ల బలం అంది. అంటే గ్రేటర్‌లో మేయర్ పీఠం సొంతం చేసుకోవాలంటే.. బీజేపీ 99 డివిజన్లలో విజయం సాధించాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌ బలాబాలను ఓ సారి పరిశీలిస్తే...  ఆ పార్టీకి ఒక్కరే ఎంపీ ఉన్నారు. మల్కాజ్‌గిరీ నియోజకవర్గం నుంచి గెలిచిన రేవంత్ రెడ్డికి ఓటు హక్కు ఉంది. ఎమ్మెల్యేలు గానీ, ఎమ్మెల్సీలు గానీ ఆ పార్టీకి లేరు. అంటే కాంగ్రెస్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు.. 101  జీహెచ్‌ఎంసీ డివిజన్లలో విజయం సాదించాల్సి ఉంటుంది. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ తర్వాత అధికంగా ఎక్స్‌ అఫీషియో సభ్యులున్నది.. మజ్లీస్‌ పార్టీకే. ఆ పార్టీకి గ్రేటర్‌లో ఓటుహక్కు కలిగిన ఒక ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలు.. ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తంగా మేయర్‌ ఎన్నికలో మజ్లీస్‌ పార్టీకి 10 ఎక్స్‌ అఫీషియో ఉన్నాయి.

 టీఆర్‌ఎస్‌ ఎక్స్‌ అఫీషియో సభ్యులు

లోక్‌సభ ఎంపీలు - 2

(కొత్త ప్రభాకర్‌ రెడ్డి, రంజిత్‌ రెడ్డి )

రాజ్యసభ ఎంపీలు  - 2

(కేకే, డి.శ్రీనివాస్‌)

ఎమ్మెల్యేలు - 17

ఎమ్మెల్సీలు - 11+5

మొత్తం ఎక్స్‌అఫీసియో సభ్యులు - 37

టీఆర్‌ఎస్ గెలవాల్సిన డివిజన్లు - 65

 

 

బీజేపీ ఎక్స్‌అఫీషియో సభ్యులు

 

ఎంపీ - 1(కిషన్‌ రెడ్డి)

ఎమ్మెల్యే - 1 (రాజాసింగ్)

ఎమ్మెల్సీ - 1 (రామచందర్‌రావు)

మ్యాజిక్‌ ఫిగర్ 102

గెలవాల్సిన డివిజన్లు 99

 

కాంగ్రెస్‌ ఎక్స్‌ అఫీషియో సభ్యులు -1

 

ఎంపీ - 1 (రేవంత్‌ రెడ్డి)

మ్యాజిక్‌ ఫిగర్ 102

గెలవాల్సిన డివిజన్లు 101

 

 

ఎంఐఎం ఎక్స్‌అఫీషియో సభ్యులు -10

ఎంపీ - 1 (అసదుద్దీన్ ఓవైసీ)

ఎమ్మెల్యేలు - 7

ఎమ్మెల్సీలు - 2

మొత్తం సభ్యులు - 10

గెలవాల్సిన డివిజన్లు - 92