మీరట్ లో స్ధానికుల వినూత్న నిరసన

మీరట్ లో స్ధానికుల వినూత్న నిరసన

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సవాల్ కు మీరట్ వాసులు ధీటైన సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని రహదారులపై ఎక్కడైనా గుంతలు ఉంటే చూపించాలని అనడంతో స్ధానికులు వినూత్న నిరసనకు దిగారు. రోహ్తాలోని ప్రధాన రహదారి పై ఉన్న గొయ్యిలోని నీటిలో వరినాట్లు వేశారు. ఈ రహదారిపై ఉన్న గొయ్యిలతో నిత్యం వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు రహదారిపై ఉన్న గుంతలలో చేరడంతో వాహనాల రాకపోకలకు కష్టంగా మారింది.

రహదారికి ఇరువైపులా నివసించే ప్రజలు ముఖ్యమంత్రి ప్రకటనపై నిరసనకు దిగారు. నిల్వ ఉన్న నీటిలో వరినాట్లు వేసి స్ధానిక ఎంపీ, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బ్యానర్లను ఏర్పాటు చేశారు. జూన్ 15వరకు రాష్ట్రంలోని రహదారులపై గొతులు లేకుండా చేస్తామని, సీఎం యోగి ఆదిత్యనాథ్ గత సంవత్సరం ఏప్రిల్ లో ప్రకటన చేశారు. 

మేము స్ధానిక ఎమ్మెల్యే, ఎంపీలకు చాలా సార్లు రహదారి పరిస్ధితిపై ఫిర్యాదు చేశామని, వారు ఈ విషయాన్ని అసలు పట్టించుకోలేదని స్ధానికులు ఆరోపిస్తున్నారు. బీజేపీ పాలనలో రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు నెలకొంటాయని అనుకోలేదని అంటున్నారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ రహదారి పరిస్థితి ఇలాగే ఉందని ఎవరూ పట్టించుకోకపోవడంతో నేడు నిరసనకు దిగామని స్ధానికులు తెలిపారు.

ఈ విషయంపై డిప్యూటి సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. ఇప్పటికే రూ. 20.65 కోట్లతో కూడిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపామని, కొన్ని విభాగాల సమస్యల కారణంగా అది ముందుకు సాగడం లేదని ఆయన తెలిపారు.