33 ఏళ్లుగా చాయ్ తాగి బతికేస్తోంది

33 ఏళ్లుగా చాయ్ తాగి బతికేస్తోంది

శీతాకాలంలో వణికించే చలిలో ఒక కప్పు వేడి వేడి టీ తాగితే ఆ కిక్కు మామూలుగా ఉండదు. అసలా మాటకొస్తే గర్మా గరమ్ చాయ్ అంటే ఇష్టపడనివాళ్లు ఎందరుంటారు? కానీ బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నిటికి బదులు టీ మాత్రమే తాగి బతికేద్దామంటే.. ఆరోగ్యం సంగతి తర్వాత అసలు సాధ్యమా అనే అనుమానం వస్తుంది. కానీ మన దేశంలోనే ఒక మహిళ 30 ఏళ్ల నుంచి చాయ్ మాత్రమే తాగి జీవిస్తోంది.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లా బరాదియా గ్రామానికి చెందిన పిల్లీ దేవిని అంతా చాయ్ వాలీ చాచీ అని పిలుస్తారు. ఎందుకంటే ఆమె 30 ఏళ్లకు పైగా సమయం నుంచి టీ తాగి జీవిస్తోంది. 11 ఏళ్ల వయసులో ఆహారం ముట్టడం మానేసిన పిల్లీ దేవి వయసు ఇప్పుడు 44 ఏళ్లు. అంటే ఆమె 33 ఏళ్లుగా కేవలం టీ నీళ్లు తాగే బతుకుతోంది. అలా అని ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. పూర్తి ఆరోగ్యంగా ఉంది.

ఆరో తరగతిలో ఉండగా పిల్లీ దేవి తిండి తినడం మానేసిందని ఆమె తండ్రి రతీరామ్ గుర్తు చేసుకుంటారు. ‘జనక్ పూర్ లోని పాట్నా స్కూల్ తరఫున జిల్లా స్థాయి టోర్నమెంట్ లో పాల్గొనేందుకు వెళ్లిన మా బిడ్డ ఆ తర్వాత తిండి, నీళ్లు మానేసిందని’ చెప్పారు. కొన్నాళ్లు పాల టీతో బిస్కెట్లు, బ్రెడ్ తిని ఆ తర్వాత పూర్తిగా టీ మీదే బతుకుతోంది. ఇప్పుడామె సూర్యాస్తమయం తర్వాత ఒకసారి కప్పు బ్లాక్ టీ మాత్రం తాగుతుంది.

పిల్లీ దేవి అలవాటుతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఇదేమైనా వ్యాధేమోనని ఆమెను వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. డాక్టర్లు ఆమె ఆరోగ్యం భేషుగ్గా ఉందని చెప్పారు. పిల్లీ దేవి ఎప్పుడో తప్ప ఇంటి నుంచి అడుగు బయటపెట్టదు. రోజంతా శివారాధనలోనే గడుపుతుంది. మనుషులు టీ తాగి బతకడం అసాధ్యమని కొరియా జిల్లా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఎస్ కె గుప్తా అన్నారు. 33 ఏళ్లుగా ఆమె అలా జీవించడం ఆశ్చర్యపరుస్తోందని చెప్పారు.