నేల మాళిగలో మహా కట్టడం

నేల మాళిగలో మహా కట్టడం

చైనా రికార్డుల్లో మరో మహాద్భుతం చోటు చేసుకుంది. షాంఘై నుంచి గంట ప్రయాణపు దూరంలో ఉన్న షెంకెంగ్ క్వారీలో అద్భుతమైన ఓ హెటల్ నిర్మించారు. సాధారణంగా క్వారీల కోసం ఉపయోగించిన భూభాగాన్ని వృథాగా వదిలేస్తారు. ఈ క్వారీనీ చైనీయులు వృథాగా వదిలేయకుండా ఎన్నో సవాళ్లు ఎదుర్కొని నేలకు దిగువన 17 అంతస్తుల హోటల్ నిర్మించారు. ఒకవైపు నేలను ఆనుకొని ఉండే ఈ హోటల్ కు అవతలి వైపు వాటర్ ఫాల్ ఉంటుంది. 

నేలతలం నుంచి 88 మీటర్ల లోతు వరకు 17 అంతస్తుల హోటల్ నిర్మించారు. ఈ హోటల్ రూముల్లో ఒక రాత్రి బస చేస్తే 3394 యువాన్లు లేదా 490 డాలర్లు. ఇక నీటి దిగువన కూడా మరో లగ్జరీ సూట్ నిర్మించారు. ఆ సూట్స్ లోకి వెళ్లిన తరువాత కిటికీల్లోంచి చూస్తే.. పెద్దపెద్ద చేపల ట్యాంకులు దర్శనమిస్తాయి. దీంతో సముద్రంలో సెలబ్రేట్ చేసుకున్న ఫీల్ కలుగుతుంది. ఇక్కడ రాక్ క్లైంబింగ్ వంటి ఎడ్వంచర్స్ కూడా చేయవచ్చు.

ఈ హోటల్ నిర్మిస్తున్నప్పుడు 2013లో భారీ వర్షం సంభవించింది. దీంతో కట్టడం సగం నీళ్లలో మునిగిపోయింది. ఒకవేళ ఆ కట్టడం పూర్తయ్యాక అలాంటి భారీ వర్షమే సంభవిస్తే.. మా కష్టమంతా బూడిదలో పోసిన్న పన్నీరుగా అయ్యేదని ఇంజినీర్లు చెబుతున్నారు. ప్రపంచంలో ఇలాంటి నేలమాళిగ హోటల్ ఇదే మొదటిది కావడంతో.. అనుభవాలన్నీ కొత్తవేనని, అనేక సవాళ్లు ఎదుర్కొని, ఎంతో శ్రమించి ఇంత అద్భుతమైన భవనాన్ని నిర్మించామని వారంటున్నారు. 

ఇంటర్ కాంటినెంటల్ షాంఘై వండర్ ల్యాండ్ గా పిలిచే ఈ హోటల్ కు అయిన ఖర్చు... 288 మిలియన్ డాలర్లు. అన్నట్టు ఇందులోనే ఓ థీమ్ పార్కు కూడా ఉందట. విలాసాలు కోరుకునేవారు ఇక్కడికి వెళ్లి ఎంజాయ్ చేసి రావచ్చు.