మూడు రాజధానులు : తమ్ముడి పోరాటం...అన్న సమర్ధింపు !

మూడు రాజధానులు : తమ్ముడి పోరాటం...అన్న సమర్ధింపు !


ఏపీ రాజధాని విషయమై నేతలు భిన్న స్వరాలు వినిపిస్తోన్న వేళ ఏపీ సీఎం జగన్‌కు మెగాసార్ట్ చిరంజీవి మద్దతు పలికారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి ఏపీ రాజధాని అంశంలో తన అభిప్రాయాలు వెల్లడించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమేనని రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. మూడు రాజధానుల అంశాన్ని అందరూ స్వాగతించాలని చిరు పేర్కొన్నారు. గతంలో అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైందని, ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని వివరించారు.

ఇప్పుడు అమరావతినే అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని అందరిలోనూ ఆందోళన ఉందని అన్నారు. అయితే, మూడు రాజధానుల అంశంపై నెలకొన్న అపోహలను, అపార్థాలను ప్రభుత్వం తొలగించాలని సూచించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమేనని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం నాకు ఉందన్నారు. అమరావతిని శాసన నిర్వాహక, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక, కర్నూల్‌ను న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలన్నారు.

నిజానికి ఈ విషయం మీద జనసేన తీవ్రంగా స్పందిస్తోంది. నిన్న జనసేన తరపున నాగబాబు, నాదెండ్ల మనోహర్ లు ఇద్దరూ అమరావతి ప్రాంతంలో కూడా పర్యటించారు. దీనిపై జనసేన పార్టీ ఆచితూచి స్పందిస్తోంది. జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రులు చెబుతున్నారని, వారి నిర్ణయం తర్వాతే తాము మాట్లాడతామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.