రివ్యూ: సైరా 

రివ్యూ: సైరా 

నటీనటులు: చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, జగపతిబాబు, తమన్నా, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, అనుష్క, రవికిషన్‌, నిహారిక, బ్రహ్మానందం, రఘుబాబు, బ్రహ్మాజీ తదితరులు
మ్యూజిక్: అమిత్‌ త్రివేది, 

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: జూలియస్‌ ఫాఖియం

సినిమాటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు
ప్రొడక్షన్‌ డిజైన్‌: రాజీవన్‌
నిర్మాత: రామ్‌చరణ్‌
దర్శకత్వం: సురేందర్‌రెడ్డి
మెగాస్టార్ చిరంజీవి 149 సినిమాల తరువాత రాజకీయాల్లోకి వెళ్లిపోయారు.  ఏడేళ్ల విరామం తరువాత మెగాస్టార్ 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అనంతరం మెగాస్టార్ 13 సంవత్సరాల కలగా ఉన్న ఉయ్యాలావాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సినిమా చేయాలని అనుకున్నాడు.  అప్పటి రోజుల్లో ఆ సినిమా చేయాలంటే  చాల బడ్జెట్ అవుతుంది.  సాంకేతికంగా పెద్దగా అభివృద్ధి సాధించలేదు.  దీంతో ఇప్పటి వరకు ఆగాల్సి వచ్చింది.  రామ్ చరణ్ కు ధృవ వంటి మంచి హిట్ అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా తెరకెక్కింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా తెలుసుకుందాం.  

కథ: 

అనగనగా రాయలసీమలోని రేనాడు ప్రాంతం.. ఈ ప్రాంతాన్ని 61మంది పాలెగాళ్ళు పరిపాలన చేస్తుంటారు.  ఆ 61 ప్రాంతాలు కూడా చిన్న చిన్న సంస్థానాలుగా ఉన్నాయి.  అయితే, వీరి మధ్య ఐక్యత లేదు.  ఒకరంటే మరొకరికి పడదు.  అప్పటి వరకు ఆ ప్రాంతంలోని పన్నులను నిజాం నవాబులు వసూళ్లు చేసేవారు. బ్రిటిష్.. నిజాం నవాబుల మధ్య జరిగిన ఒప్పందంతో.. అక్కడి పన్నులను వసూలు చేసుకునే హక్కును బ్రిటిష్ పాలకులకు అప్పగిస్తుంది.  వర్షాలు లేక, పంటలు పండగ నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా పన్నులు కట్టాలని బ్రిటిష్ పాలకులు ఒత్తిడి తీసుకొస్తారు.  ప్రజలను హింసిస్తుంటారు.  అలాంటి సమయంలోనే సైరా నరసింహారెడ్డి బ్రిటిష్ పాలకులపై పోరాటం చేసేందుకు సిద్ధం అవుతాడు.  అయితే, 61 పాలెగాళ్ళ మధ్య సఖ్యత లేకపోవడంతో మొదట్లో ఇబ్బందులు పడతారు.  అనంతరం 61 మంది పాలెగాళ్లను ఒకతాటిపైకి తీసుకొచ్చి బ్రిటిష్ పాలకులను ఎలా ఎదుర్కొన్నారు అన్నది చిత్ర కథ.  

విశ్లేషణ: 

సినిమా కథను రేనాడులో కాకుండా ఝాన్సీలో ప్రారంభం చేశారు.  బ్రిటిష్ దొరలు ఝాన్సీపై దండెత్తుతారు.  దీంతో ఝాన్సీ లక్ష్మీభాయ్ వారిని ఎదుర్కొంటుంది.  అదే సమయంలో తన సైనికులకు బ్రిటిషర్లపై పోరాటం మొదలు పెట్టింది మనం కాదని, మొదట రేనాడు ప్రాంతంలో సైరా నరసింహారెడ్డి అనే వీరుడు బ్రిటీషర్లపై పోరాటం చేశారని అనుష్క చెప్పడంతో కథ రరేనాడు ప్రాంతానికి మారుతుంది.  

61 చిన్న చిన్న సంస్థానాలు.. వాళ్ళ మధ్య గొడవలు.. ఐక్యమత్యం లోపించడం.. బ్రిటిష్ పాలకులు పన్నులు వసూలు చేయడానికి రావడం.. ప్రజలను హింసించడం వంటి విషయాలను ఒక్కొక్కటిగా రివీల్ చేసుకుంటూ.. కథలోకి తీసుకెళ్లిన విధానం బాగుంటుంది.  అప్పటి బ్రిటిష్ పాలకులు పన్నుల కోసం ప్రజలను ఎలా హింసించేవారో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.  బ్రిటిష్ పాలకులపై పోరాటం చేయాలి అంటే ఒక్కొక్కరుగా పోరాటం చేస్తే కుదరదని, అందరు కలిసి కట్టుగా పోరాటం చేయాలి అని 61 సంస్థానాల మధ్య ఐక్యమత్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు సైరా నరసింహారెడ్డి.  అదే సమయంలో బ్రిటిష్ సైనికులతో ఒంటరిగా తన సైనికులతో పోరాటం చేస్తుంటాడు.  ఇంటర్వెల్ కు ముందు వచ్చే పోరాట సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకుని విధంగా ఉంటాయి.  ఇంటర్వెల్ సమయంలో బ్రిటిష్ అధికారిని చంపడంతో సెకండ్ హాఫ్ లో పై ఉత్కంఠత ఏర్పడుతుంది.  

సెకండ్ హాఫ్ కథ గమన వేగం పెరుగుతుంది.  బ్రిటిష్ అధికారిని హతమార్చిన విషయం తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం అక్కడి పోరాటాన్ని అణిచివేసేందుకు అత్యంత క్రూరుడైన అధికారిని అక్కడికి పంపుతుంది.  అక్కడి నుంచే అసలు కథ మొదలౌతుంది.  ఒకవైపు సంస్థానాల మధ్య ఐక్యత తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే.. మరోవైపు బ్రిటిష్ దొరలపై పోరాటం చేస్తున్నాడు.  మెగాస్టార్ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా పోరాట సన్నివేశాలు ఉండటం విశేషం.  ఇక క్లైమాక్స్ లో సైరా చిన్న సైన్యం పదివేలమంది బ్రిటిష్ సైనికులను చంపడం అన్నది లాజిక్ కు దూరంగా ఉంది.  క్లైమాక్స్ ను భావోద్వేగాలతో ముగించాడు.  

నటీనటుల పనితీరు: 

మెగాస్టార్ చిరంజీవి సినిమాను తన భుజస్కందాలపై వేసుకొని నడిపించాడు.  యోధుడిగా మెగాస్టార్ చిరంజీవి నటన అమోఘం.  ఇక గురువుగా గోసాయి వెంకన్నగా అమితాబ్ పాత్ర హుందాగా ఉన్నది.  అవుకు రాజుగా సుదీప్, పాండిరాజాగా విజయ్ సేతుపతి, వీరారెడ్డిగా జగపతిబాబు, బసిరెడ్డిగా రవికిషన్ , నయనతార, తమన్నా ఇలా ప్రతి ఒక్కరు తమ పాత్రలో ఇమిడిపోయి నటించారు.  

సంకేతికవర్గం పనితీరు: 

సైరా సాంకేతికంగా సూపర్ అని చెప్పాలి.  మెగాస్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాను నడిపించిన తీరు బాగుంది.  చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉండే విధంగా చూసుకున్నారు.  రత్నవేలు సినిమాటోగ్రఫీ వండర్ చేసింది.  అమిత్ త్రివేది సంగీతం, జులియన్ నేపధ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

నటీనటులు 

మెగాస్టార్ నటన 

వార్ ఎపిసోడ్స్ 

సాంకేతిక వర్గం పనితీరు 

నెగెటివ్ పాయింట్స్: 

ఫస్ట్  హాఫ్ లో సాగతీత 

లాజిక్ లేని పోరాటం 

చివరిగా : సైరా.. తెలుగువాడు గర్వించే సినిమా..