మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి..

మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి..

'మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. లేదంటే మాకు ఈ రాష్ట్రం నుంచి విముక్తి కల్పించి మా గ్రామాలను తెలంగాణలో కలిపేయండి' అని మహారాష్ట్రకు చెందిన 40 సరిహద్దు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తమకు చేరువలో ఉన్న తెలంగాణలో అభివృద్ధి, ప్రజలకు, రైతులకు  ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, అమలు చేస్తున్న పథకాలను చూసి ఆకర్షితులవుతున్నారు. ఐదారు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని తమ గ్రామాలను తెలంగాణలో కలిపేయాలని కోరుతున్నారు. ఈమేరకు నాందేడ్ జిల్లాలోని ధర్మాబాద్ తహసీల్ పరిధిలోని 40 గ్రామాల సర్పంచ్‌లు తెలంగాణ  స్థానిక ప్రజాప్రతినిధిని కలిసి విజ్ఞాపన కూడా సమర్పించారు.  'తెలంగాణలో చాలా బాగుంది.  మహారాష్ట్రలో ఉంటే ప్రయోజనం లేదు. అందుకే తెలంగాణలో మమ్మల్ని కలిపేయండి. తెలంగాణలో వ్యవసాయానికి విత్తనాలు, ఎరువులు అన్నీ దొరుకుతాయి. కరెంటు కోతల్లేవు. రోడ్లు బాగున్నాయి' అని ముక్తకంఠంతో చెబుతున్నారు. 

ఈ గ్రామస్థుల డిమాండ్‌ సబబేనని నాందేడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న శివసేన ఎమ్మెల్యే హేమంత్‌పటేల్‌ అంటున్నారు. తన మాటను ప్రభుత్వంలో ఎవరు కూడా వినే పరిస్థితి లేదని చెబుతున్నారు.  పక్కనే ఆనుకుని ఉన్న తెలంగాణలోని గ్రామాల్లో రోడ్లు చాలా బాగున్నాయని,  24 గంటలు విద్యుత్ సరఫరా, ఇతర సౌకర్యాలను రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని హేమంత్‌ చెబుతున్నారు. ఈ గ్రామస్థలు డిమాండ్‌ న్యాయబద్ధమే అని అన్నారు. 

ఈ వార్తను ఓ జాతీయ టీవీ ఛానల్‌ ప్రసారం చేయగా ఆ వీడియోను మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ''వేగవంతమైన అభివృద్ధిని కోరుకుంటున్న ధర్మబాద్ జిల్లాలోని 40 గ్రామాల ప్రజలు 'తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలిపేయ'మని కోరుకుంటున్నారు. దీనికి వారి ఎమ్మెల్యే కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇంతకు మించిన అభినందనలు ఉండవేమో..'' అని పేర్కొటూ ఆ వీడియోను షేర్‌ చేశారు.