టీఆర్ఎస్ మంత్రుల సోదరులను బీజేపీ ఆకర్షిస్తోందా?

టీఆర్ఎస్ మంత్రుల సోదరులను బీజేపీ ఆకర్షిస్తోందా?

ఓరుగల్లులో కాషాయపార్టీ ఎన్నికల రణతంత్రం మొదలైందా? మంత్రి సోదరుడికే బీజేపీ కండువా కప్పబోతున్నారా? మరికొందరు కీలక నాయకులు కూడా కమలం వలకు చిక్కారా? వరంగల్‌ రాజకీయాన్ని హీటెక్కిస్తోన్న ఆ పరిణామాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

వరంగల్‌లో బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌!

ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లుపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది బీజేపీ. త్వరలో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనుండటంతో క్షేత్రస్థాయిలో పట్టుకోసం వీటిని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు కమలనాథులు. ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉండటంతో పట్ణణ ఓటర్లను ఆకర్షించేందుకు కీలక నేతలను పార్టీలోకి తీసుకొచ్చే పని మొదలుపెట్టారు నాయకులు. 

బీజేపీలోకి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు? 

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న ముఖ్యనేతలతో బీజేపీ నాయకులు టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం. వరంగల్‌ వేదికగా చాలా మంది బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. వీరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ప్రదీప్‌రావు, శాప్‌ మాజీ డైరెక్టర్‌ రాజనాల శ్రీహరి.. మరో పదిమంది కార్పొరేటర్లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌లో తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ప్రదీప్‌రావు కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నారట. పైగా ప్రదీప్‌రావుకు వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ ఎమ్మెల్యేలతో నిత్యం యుద్ధమే నడుస్తోంది. ప్రదీప్‌రావు తెలంగాణ నెక్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయన్ని టార్గెట్‌ చేస్తున్నారట. 

బహిరంగ సభ ఏర్పాటు చేసి బీజేపీలోకి ఎంట్రీ!

ప్రదీప్‌రావు అనుచరులపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే కేసులు పెట్టించినట్టు తెలుస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి బరిలో దిగాలని ఆయన గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి బీజేపీ నేతలు ప్రదీప్‌రావుతో మాట్లాడుతున్నట్టు సమాచారం. బీజేపీలో చేరికకు వారు ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వరంగల్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారట. 

పార్టీ నేతలను బుజ్జగించే పనిలో టీఆర్‌ఎస్‌ మంత్రులు!

ప్రదీప్‌రావు బీజేపీకి వెళ్తున్నారని తెలుసుకున్న జిల్లాకు చెందిన మంత్రులు.. ఎమ్మెల్సీలు అప్రమత్తం అయ్యారట. ప్రదీప్‌రావుతో సన్నిహితంగా ఉంటే కార్పొరేటర్లు.. ఇతర టీఆర్‌ఎస్‌ నేతలను బుజ్జగించే పనిలో ఉన్నట్టు సమాచారం. దీంతో ఒక్కసారిగా ఓరుగల్లు రాజకీయం వేడెక్కింది. ప్రదీప్‌రావు బీజేపీలోకి వెళ్తే.. ఆయన్ని అనుసరించేవాళ్లు ఎవరు? మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో  పరిణామాలు ఎలా మారతాయి అని అంచనాలు వేసుకుంటున్నారట. 

గతంలో పీఆర్పీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రదీప్‌రావు!

ప్రదీప్‌రావు గతంలో PRP నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. తనకంటూ కొంత అనుచరగణాన్ని, అభిమానులను తయార చేసుకున్నారు. అందుకే ప్రదీప్‌రావు బీజేపీలో చేరితే కాషాయదళం బలం పెరుగుతుందని అనుకుంటున్నారు. పైగా స్థానికంగానే సభ ఏర్పాటు చేసి భారీ అనుచరగణంతో బీజేపీలో చేరబోతుండటంతో .. లోకల్‌గా ఆ ఎఫెక్ట్‌ ఉంటుందని చెవులు కొరుక్కుంటున్నారు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.