కేసీఆర్ ఓ సామాజిక ఇంజినీర్...

కేసీఆర్ ఓ సామాజిక ఇంజినీర్...

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఓ సామాజిక ఇంజినీర్‌గా అభివర్ణించారు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్‌రావు... ఖైరతాబాద్ ఇంజినీర్స్ భవన్‌లో నాలుగేళ్ల ప్రగతిపై జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ... రైతు మాటే మనకు వేదం అన్నారు. ఈ ఏడాది నీటి నిర్వహణ చాలా చక్కగా జరిగిందన్న హరీష్‌రావు... సమిష్టి కృషితోనే అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు. ఎన్ఎస్పీలో ఈ సంవత్సరం ఒక టీఎంసీకి 11,796 ఎకరాల సాగు జరిగిందని... ఈ సారి 5 లక్షల 50 వేల అదనపు ఎకరాలకు నీరు అందించినట్టు వెల్లడించారు హరీష్‌రావు. నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్, పోచంపాడ్ ద్వారా మెరుగ్గా నీరు అందించామని... నిజాంసాగర్ ద్వారా ఒక టీఎంసీతో 13,021 ఎకరాలకు నీరు అందించి చరిత్ర సృష్టించామన్నారు. 

ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి ద్వారా పంటల దిగుబడి పెరిగినట్టు తెలిపారు మంత్రి హరీష్‌రావు... గతంలో రబీ కాలంలో మూడు ధర్నాలు, ఆరు రాస్తారోకోలు జరిగేవని... ఈ సంవత్సరం రబీలో 13 లక్షల 57 వేల ఎకరాలకు ఒక్క ధర్నా, దరఖాస్తు లేకుండా నీరందించామన్నారు. ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా తన ప్రాంతంలో నీరు రావడం లేదని ఫిర్యాదు చేయలేదనే విషయాన్ని గుర్తుచేసిన హరీష్‌రావు... రైతుల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది... రైతుల గుండెల్లో ఇంజినీర్స్, ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచిపోయారని వెల్లడించారు. 25 ఏళ్ల తర్వాత మొట్ట మొదటిసారిగా చివరి ఆయకట్టు వరకు నీరందించామన్న ఇరిగేషన్ శాఖ మంత్రి... ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి ఇంజినీర్స్ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కొత్తగా వచ్చిన 650 మంది ఇంజినీర్లు చాలా నేర్చుకోవాలని సూచించారు. రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖలతో ముడిపడి ఉన్న శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు... రాత్రి సమయంలో పని చేసే మహిళ ఇంజినీర్స్‌కు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు హరీష్‌రావు.