మహబూబ్‌నగర్‌లోనూ క్లీన్ స్వీప్ చేస్తాం...

మహబూబ్‌నగర్‌లోనూ క్లీన్ స్వీప్ చేస్తాం...

ఉత్తర తెలంగాణ లాగానే ఈసారి మహబూబ్ నగర్‌లోని అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు... కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కృష్ణారెడ్డి, అబ్రహం సహా పలువురు నేతలకు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన ఆయన... ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాలమూరు నుంచి నేతలను ఢిల్లీకి పంపినా ఆకలి చావులు తగ్గలేదన్నారు. కల్వకుర్తి అని ప్రాజెక్టుకు పేరు పెట్టిన కాంగ్రెస్ నేతలు... కల్వకుర్తికి నీరు ఇవ్వలేదని మండిపడ్డ హరీష్... కల్వకుర్తికి నీరు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని... ఈ ఏడాది అలంపూర్ లో 87 వేల ఎకరాలకి నీరు ఇచ్చి రుణం తీర్చుకుంటామన్నారు. 

దామోదర్ రెడ్డి, ఇతరుల చేరికతో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మహబూబ్ నగర్‌లో 14 సీట్లలో టీఆర్ఎస్‌ అభ్యర్థులే విజయం సాధిస్తారన్నారు హరీష్ రావు... కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎప్పుడన్నా పట్టించుకుందా? అని ప్రశ్నించిన ఆయన... ప్రతి పంటకూ మద్దతు ధర ఇచ్చిన ప్రభుత్వం తమదే అన్నారు. రైతుల కళ్లలో ఆనందం చూసి కాంగ్రెస్ నేతలు ఏడ్చి ఏడ్చి వాళ్ల కళ్లు ఎర్రబడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్... గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఇప్పటికే మంజూరు చేశాం... తుమ్మిల్ల నుంచి నీటి విడుదల, గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టుకు త్వరలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. కాంగ్రెస్ నేతలది ఎప్పుడూ కుర్చీల కొట్లాటేనని... వాళ్లు ప్రజల గురించి ఎప్పుడూ పట్టించుకోరంటూ ఎద్దేవా చేశారు హరీష్‌రావు. పాలమూరు ప్రాజెక్టుకు మీరు వ్యతిరేకం కాకపోతే వెంటనే కోర్టులో వేసి కేసును విత్ డ్రా చేసుకోవాలని... లేదంటే ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేస్తారన్నారు హరీష్‌రావు.