గుడ్‌న్యూస్.. స్థలం ఉంటేసరి ఇల్లు కట్టుకోవడానికి నిధులు..!

గుడ్‌న్యూస్.. స్థలం ఉంటేసరి ఇల్లు కట్టుకోవడానికి నిధులు..!

సొంత ఇల్లు కల నెరవేర్చుకోవడానికి ఎన్నో ఆపసోపాలు పడాల్సి వస్తుంది.. అయితే, పేదవాడి సొంతింటి కల నెరవేర్చడానికి డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. మరో కొత్త ఆలోచలో ఉంది.. స్థలాలు ఉండి ఇల్లు కట్టుకునేవారికి నిధులు మంజూరు చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు స్పష్టమవుతోంది.. మెదక్ జిల్లా మాసాయిపేటలో నూతన మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థలాలు ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు నెల రోజుల్లో నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. టీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో 103 కొత్త మండలాలను ఏర్పాటు చేశామన్నారు మంత్రి హరీష్‌రావు.. గతంలో ఎండాకాలం వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో త్రాగు నీరు సమస్య ఉండేది.. కానీ, నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తున్నాం అన్నారు. దేశంలో కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ గ్రామాల అభివృద్ధి జరగలేదని విమర్శించిన హరీష్‌రావు.. నేడు పల్లె ప్రగతి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తున్న ఘనత టీఆర్ఎస్ కు దక్కుతుందన్నారు. మరోవైపు.. రాష్ట్రానికి రావాల్సిన ఆరు వందల కోట్ల రూపాయల నిధులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోత విధించిందని మండపడ్డ హరీష్‌రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలిపోయే పేలిపోయే మోటర్లు ఉండేవి, నేడు తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తుందన్నారు.