తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలి

తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలి

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేసిన సీడబ్ల్యూసీ తెలంగాణకు కూడా హోదా ఇవ్వాలని ఎందుకు గుర్తుకు రాలేదని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్నారు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలు స్ధాపించుకునే వారికి ఇన్సెంటివ్ లు, పన్ను మినహాయింపు సౌకర్యం కల్పిస్తారని దీంతో ఇక్కడి పరిశ్రమలు ఏపీకి తరలిపోవా అని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ వద్ద 65వ జాతీయ రహదారిపై నిర్మించనున్న అండర్ పాస్ రోడ్డుకు, అమీన్ పూర్ చౌరస్తాలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి హరీష్ మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీలు రెండు ఇప్పటికే తెలంగాణకు ఎంతో అన్యాయం చేశాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన కేంద్రం తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వదని అన్నారు. పోలవరంతో పాటు ఇతర అభివృద్ది కార్యక్రమాలకు ఏపీకి ఇచ్చిన ఇన్సెంటీవ్ లు, పన్నురాయితీలు తెలంగాణకు ఇవ్వాలని ఈ అంశం విభజన నిబంధనల్లో ఉందని మంత్రి హరీష్ అన్నారు.