ఆ ప్రాంతంపై బురద జల్లడం పద్ధతి కాదు : కన్నబాబు

ఆ ప్రాంతంపై బురద జల్లడం పద్ధతి కాదు : కన్నబాబు

29 రాష్ట్రాల్లో చక్రం తిప్పుతానన్న చంద్రబాబు 29 గ్రామాలకు పడిపోయారని మండిపడ్డారు ఏపీ మంత్రి కన్నబాబు. రాజకీయంగా పతనమైన చంద్రబాబుపై జగన్ కు కోపం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారాయన. అలాగే విశాఖలో మావోయిస్టు ప్రభావం ఉంటుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. హైదరాబాద్ సమీపంలో మాజీ హోం మంత్రి  మాధవరెడ్డి చనిపోయారని రాజధాని మార్చారా అని ప్రశ్నించారాయన. విశాఖలో రాజధాని రాకముందే ఆ ప్రాంతంపై బురద జల్లడం పద్ధతి కాదన్నారు కన్నబాబు. అమరావతిపై ప్రేమ మాటల్లోనే ఉందని, చేతల్లో ఎక్కడా కనిపించడం లేదన్నారు ఏపీ మంత్రి కన్నబాబు.

అమరావతి విషయంలో చంద్రబాబుకు కమిట్ మెంట్ ఉంటే అన్నీ తాత్కాలిక భవనాలు ఎందుకు కట్టారని ప్రశ్నించారాయన. కనీసం రైతులకు ఇస్తామన్న ప్లాట్లు కూడా ఇంకా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు, చంద్రబాబు ప్రాణం అమరావతిలో ఉందని కన్నబాబు ఆరోపించారు. శివరామకృష్ణన్ కమిటీని బాబు పట్టించుకోలేదన్న ఆయన కొత్తగా నగరాన్ని నిర్మించాలంటే మూడు నాలుగేళ్ళు పడుతుందని అన్నారు. అలాంటిది బాబు గ్రాఫిక్స్ లో చూపిన నగరాన్ని కట్టాలంటే మాత్రం ముప్పై ఐదు ఏళ్ళు పడుతుందని అన్నారు. అలాగే ప్రాంతాల మధ్య అడ్డుగోడలు కట్టడం చంద్రబాబుకు అలవాటనే నని కృష్ణా, గుంటూరు జిల్లాలకు, మిగతా జిల్లాలకు మధ్య అపోహలు పెరిగే విధంగా వ్యవహరించొద్దని కోరారాయన.