హైదరాబాద్‌కు 2 రోజుల ముందే సంక్రాంతి పండుగ-కేటీఆర్

హైదరాబాద్‌కు 2 రోజుల ముందే సంక్రాంతి పండుగ-కేటీఆర్

సంక్రాంతి పండుగ హైదరాబాద్‌లో రెండు రోజుల ముందే వచ్చింది అని ఇక్కడ ప్రజల సంతోషం చూస్తూ తెలుస్తుందన్నారు మంత్రి కేటీఆర్.. హైదరాబాద్‌లోని రెహమత్‌నగర్‌లో ఉచిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన ఆయన.. ఇంటింటికీ జీరో నీటి బిల్లులను పంపిణీ చేశారు.. ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో జల మండలి ముందు నీటి కోసం ఆందోళనలు చూశాం.. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.. హైదరాబాద్‌లోని 9 లక్షల కుటుంబలకు ఉచితంగా తాగునీరు ఇచ్చే పరిస్థితికి వచ్చామన్నారు.. జీరో వాటర్ బిల్లు ఇంటింటికి తిరిగి ఇచ్చామని వెల్లడించారు. ఇక, ఎన్నికలు వచ్చిన్నప్పడు చాలా మంది చాలా చెబుతారు.. కానీ, సీఎం కేసీఆర్ నల్లా బిల్లు కట్టాల్సిన అవసరం లేదని డిసెంబర్‌లో అన్నారు... ఆ మాటను ఇవాళ కేసీఆర్ నిలబెట్టుకున్నారని తెలిపారు. జూబ్లీ హిల్స్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపిన కేటీఆర్.. కరెంటు, మంచి నీటి బాధ పోయిందని ప్రకటించారు. 

ఇక, హైదరాబాద్ లో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి కావొచ్చింది... త్వరలో పంపిణీ చేస్తామని ప్రకటించారు మంత్రి కేటీఆర్.. కరోనా సంక్షోభంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదని గుర్తుచేసిన ఆయన.. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో పేదలకు స్వర్ణ యుగంగా అభిర్ణించారు. వాటర్ బిల్లు పెరగడం కాదు... ఉన్నది కూడా పోయిందని పేర్కొన్న ఆయన.. ఎన్నికలు లేనప్పుడు కూడా ప్రజల మధ్య ఉంటూ సేవ చేస్తామన్నారు. కాగా, ప్రభుత్వం తీసుకున్న తాజా స్కీమ్ ప్రకారం.. గ్రేటర్ పరిధిలోని ఓ కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీరు సరఫరా చేయనున్నారు.. డిసెంబ‌రు బిల్లు నుంచే ఈ ఉచిత పథ‌కం అమ‌ల్లోకి వచ్చింది.. డిసెంబ‌ర్ 2020 నెలకు సంబంధించి 20 వేల లీటర్ల వ‌ర‌కు నీటిని వాడుకున్నవారు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకుండా జీరో బిల్లులు పంపిణీ చేస్తున్నారు.. గృహ వినియోగానికి 20వేల లీటర్ల ఉచిత నీటిని పొందేందుకు తప్పనిసరిగా మీటర్ ఉంటుంది.. మీటర్ రీడింగ్ ప్రకారం నెలలో 20 వేల లీటర్లు దాటితే ప్రస్తుతం చెల్లిస్తున్న టారీఫ్ ప్రకారం బిల్లు ఉంటుంది.. అపార్టుమెంట్లలోని ప్లాట్ల లెక్కన ఒక్కో ఫ్లాటుకు 20వేల లీటర్ల చొప్పున మొత్తం ఫ్లాట్లకు తాగునీరు అందించనుంది జలమండలి.. 10 ఫ్లాట్లు ఉన్న అపార్టుమెంట్ కు 2 లక్షల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేసి... అంతకు మించిన నీటికి పాత టారీఫ్ లెక్కన బిల్లు వసూలు చేస్తారు. అయితే, జల మండలికి గ్రేటర్ లో మొత్తం 10.08 లక్షల నల్లా కనెక్షన్లలో 2. 37 లక్షల నల్లాలకే మీటర్లు ఉన్నాయి.. మిగతావారు ఆధార్ లింక్‌ను జలమండలి వెబ్ సైట్, మీ సేవ ద్వారా చేసుకోవచ్చు. వినియోగదారులు  మార్చి 31 తేదీ వరకు మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.