సంక్షేమంలో దేశానికే తెలంగాణ తలమానికం

సంక్షేమంలో దేశానికే తెలంగాణ తలమానికం

సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దేశానికే తెలంగాణ రాష్ట్రం తలమానికంగా నిలిచిందన్నారు తెలంగాణ తాజా మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్... సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ... సంక్షేమానికి ఇది స్వర్ణయుగం, నవ తెలంగాణే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. పరిపాలనలో సంస్కరణలు తీసుకురావడంతో గణనీయమైన అభివృద్ధిని సాధించామన్న కేటీఆర్... రాష్ట్ర ప్రగతి చక్రం ఆగొద్దంటే పని చేసే ప్రభుత్వం, నాయకుడిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి... ఆ అనుమానాల నీలినీడల నుంచి ఆర్థిక, రాజకీయ స్థిరత్వం సాధించామన్నారు కేటీఆర్... 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే వాళ్లు ఆశ్చర్య పోయే విధంగా పాలన అందించాం. కేసీఆర్ ఉద్యమకారుడే కాదు.. మంచి పరిపాలకుడిగా నిరూపించుకున్నారని తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రం 16 రంగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచామని వెల్లడించిన కేటీఆర్... నేత కార్మికుల ఆత్మైస్థెర్యం పెరిగేలా చేశామన్నారు. దివ్యాంగుల సంక్షేమంలోనూ ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోందన్న కేటీఆర్... రాష్ర్టానికి పరిశ్రమలు తరలివస్తున్నాయి. పరిపాలన సంస్కరణలతో ఆదాయం సృష్టించి సంపద పెంచగలిగాం. సులభతర వాణిజ్యంలో దేశానికే ఆదర్శంగా ఉన్నామన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మూడంచెల విధానం అమలు చేశామని వెల్లడించిన కేటీఆర్... లక్షా 9 వేల ఉద్యోగాలకు గానూ 87 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే సుమారు 40 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టాం... మిగతా ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు.