ఖమ్మం నేతలపై కేటీఆర్‌ ఆగ్రహం.. మీరు ఉంటారు.. పోతారు.. కానీ..!

ఖమ్మం నేతలపై కేటీఆర్‌ ఆగ్రహం.. మీరు ఉంటారు.. పోతారు.. కానీ..!

ఖమ్మం నేతలతో టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సమావేశం ముగిసింది... జిల్లాలో అభివృద్ధి పనులు, పార్టీ పరిస్థితి, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలు తదితర అంశాలపై చర్చ సాగింది. అయితే, ఈ భేటీలో ప్రజాప్రతినిధులు, నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్‌. సమావేశంలో ఖమ్మంలో అభివృద్ధి పనుల వివరాలను కేటీఆర్‌కు అందజేశారు ఎమ్మెల్యేలు..  అయితే, పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ఆదేశించారు కేటీఆర్.. ఇదే సమయంలో.. పలువురు ఎమ్మెల్యేల తీరు దురుసుగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కొత్త, పాత అందరితో కలిసి పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు ఉంటారు.. పోతారు.. కానీ, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉండడం అవసరం అన్నారు. పార్టీలో నాయకులంతా కలిసి పనిచేయాలని స్పష్టం చేసిన కేటీఆర్.. జమిలి ఎన్నికలపై ప్రచారం జరుగుతోంది.. జమిలి వచ్చినా.. రాకపోయినా అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా, ఖమ్మం జిల్లా రాజకీయాలకు పార్టీకి తలనొప్పిగా మారాయని చెబుతారు.. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఖమ్మం జిల్లాలో గ్రూపు రాజకీయాలు బయట పడుతూనే ఉన్నాయి... అప్పుడప్పుడు కొందరు నేతలు చేస్తున్న కామెంట్లు.. పార్టీకి ఇబ్బంది కరంగా మారుతున్నాయి. తాజాగా, మాజీ ఎంపీ పొంగులేటి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.. ఎమ్మెల్యేల తీరు కూడా పార్టీని ఇబ్బందుల్లో పడేస్తోంది. దీంతో.. జిల్లా నేతలతో జరిగిన సమావేశం హాట్‌హాట్‌గా సాగిందని చెబుతున్నారు. కొందరు నేతలు సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోవడం కూడా చర్చగా మారింది.