నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన కేటీఆర్‌...

నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన కేటీఆర్‌...

క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్‌తో ఓ వైపు ఉపాధి దెబ్బ‌తింది.. ఉన్న ఉద్యోగం గ్యారంటీ లేదు.. ఇప్ప‌టికే చాలా మంది నిరుద్యోగుల‌కు మారారు.. ఈ త‌రుణంలో నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. మున్సిపాలిటీల అభివృద్ధిపై ఫోక‌స్ పెట్టింది తెలంగాణ‌ స‌ర్కార్.. ఇందులో భాగంగా పురపాలికల అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించే సిబ్బందిని భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది.. మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇప్పటికే కేబినెట్ సైతం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని తెలిపారు మంత్రి కేటీఆర్.. హైదరాబాద్‌లో మున్సిపాలిటీల అభివృద్ధి ప్రణాళికపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి సమీక్ష నిర్వ‌హించిన కేటీఆర్.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రానున్న మూడేళ్ల‌లో రాష్ట్రంలోని మున్సిపాలిటీల రూపురేఖలు మార్చాలనే సంక‌ల్పంతో ఉన్నామ‌ని.. ఆ దిశగా నాయకులు, అధికారులు పనిచేసేలా చర్యలు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. 

ఇక‌, అభివృద్ధి విషయంలో ప్రత్యేక వ్యూహంతో దూసుకుపోతున్న సిద్దిపేట మున్సిపాలిటీని అన్ని మున్సిపాలిటీలు ఆదర్శంగా తీసుకోవాల‌ని సూచించారు మంత్రి కేటీఆర్.. పురపాలికల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, ఉద్యానవనాలు, తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరణ, పన్ను వసూళ్లు వంటి వివిధ 42 అంశాల ప్రాతిపదికగా తీసుకుని మున్సిపాలిటీని అభివృద్ధి పర్చాలని ఆదేశించారు. చెత్త సేకరణను మొక్కుబడిగా కాకుండా.. కొత్త ఒరవడితో సేకరించాలని, మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ఉదయం 5.30 గంటల నుంచి వార్డుల్లో పర్యటించి ప్రజా స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డం.. వాటికి ప‌రిష్కారం చూప‌డంపై దృష్టిసారించాల‌ని ఆదేశించారు.