తెలంగాణాలో భారీ వర్షాలు.. అన్ని సెలవులు రద్దు !

తెలంగాణాలో భారీ వర్షాలు.. అన్ని సెలవులు రద్దు !

తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మరో రెండు వారాల పాటూ వర్షాలు పడే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు మంత్రి కేటీఆర్. మున్సిపల్ అధికారులకు సెలవులు రద్దు చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు మంత్రి.  

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై పురపాలక మంత్రి కేటీఆర్ సమీక్షించారు. జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని పురపాలికల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై చర్చించారు. మరో రెండు వారాల పాటు వానలు పడే అవకాశం ఉండడంతో ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. 

వచ్చే రెండు వారాలు అధికారులు పూర్తిగా క్షేత్ర స్థాయిలో ఉండి పని చేయాలని సూచించారు మంత్రి కేటీఆర్‌. ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వర్షాల కోసం ప్రత్యేకంగా సీనియర్ అధికారులకు బాధ్యత అప్పగించాలని, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి తోపాటు కమిషనర్లు సైతం ఆకస్మిక తనిఖీలు చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. 

ప్రస్తుతం సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదవుతోందని మంత్రి కేటీఆర్‌కి వివరించారు అధికారులు. ఒక్క హైదరాబాద్‌లోనే గత పది రోజుల్లో 54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని... ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ వానలు పడడం లేదని తెలిపారు. ఒకట్రెండు గంటల్లోనే భారీగా వర్షం కురుస్తుండడం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని తెలిపారు.  

బలహీనంగా, కూలి పోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలను వెంటనే గుర్తించి, కూల్చివేయాలని అధికారులకు సూచించారు మంత్రి కేటీఆర్‌. ఇప్పటికే గుర్తించిన భవనాల కూల్చివేతల్ని వేగవంతం చేయాలన్నారాయన. భవన నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాల్సిందిగా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు మంత్రి. 

వర్షాల వల్ల పాడవుతున్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు మంత్రి కేటీఆర్‌. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాక... యుద్ధ ప్రాతిపదికన రోడ్లను పూర్తి స్థాయిలో బాగు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు మంత్రి. వర్షాలు తగ్గిన వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని కూడా ఆదేశించారు మంత్రి. మొత్తానికి మరో రెండు వారాల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో... ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించే దిశగా చర్యలు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం.