కరోనా నివారణపై తప్పుడు వ్యాఖ్యలు చెయ్యొద్దు... అలాగైతే మోడీ కూడా ఫెయిలైనట్టేనా...!!

కరోనా నివారణపై తప్పుడు వ్యాఖ్యలు చెయ్యొద్దు... అలాగైతే మోడీ కూడా ఫెయిలైనట్టేనా...!!

మంత్రి కేటీఆర్ ఈరోజు మహబూబ్ నగర్లో పర్యటించారు.  అక్కడి అభివృద్ధి కార్యక్రమాల్లో  పాల్గొన్నారు.    అనంతరం మహబూబ్ నగర్లో నిర్మించిన మెడికల్ కాలేజీ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.   త్వరలోనే మెడికల్ కాలేజీలో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. వైద్యం, విద్య ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని అన్నారు.  ప్రభుత్వ వైద్య రంగంపై మరింత నమ్మకం కలిగిస్తామని కేటీఆర్ తెలిపారు.  

ప్రైవేట్ ఆసుపత్రులు  కరోనా రోగులను తిరస్కరించినా, ప్రభుత్వ ఆసుపత్రులు అండగా నిలిచాయని తెలిపారు.   కరోనా రోగులతో వెలివేసినట్టుగా వ్యవహరించరాదని అన్నారు.   కరోనా వారు వీరు అనే తేడా లేకుండా ఎవరికైనా రావొచ్చని, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం చేయడం తగదని  మంత్రి కేటీఆర్ తెలిపారు.  ముఖ్యమంత్రి  కేసీఆర్ కరోనా నివారణ విషయంలో ఫెయిల్ అయ్యారని అనడం అర్ధరహితం అని, ప్రపంచంలో కరోనా కేసుల్లో ఇండియా మూడో స్థానంలో ఉందని, ఇలా చూసుకుంటే కరోనా కట్టడిలో మోడీ కూడా విఫలమైనట్టేనా అని ప్రశ్నించారు.  ఇది రాజకీయాలకు సమయం కాదని, కలిసికట్టుగా కరోనాపై పోరాటం చేయాల్సిన సమయం అన్నారు.   రాజకీయంగా విమర్శలు చేయడం వలన వైద్య సిబ్బంది ఆత్మ స్థైర్యం దెబ్బతింటుందని అన్నారు.   అవసరమైతే కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య మరింత పెంచుతామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు.