వందేళ్ల తర్వాత అతిపెద్ద వర్షం.. అప్రమత్తంగా ఉన్న అందరికీ థ్యాంక్స్!

వందేళ్ల తర్వాత అతిపెద్ద వర్షం.. అప్రమత్తంగా ఉన్న అందరికీ థ్యాంక్స్!

అతిపెద్ద వాన హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది.. హైదరాబాదీలకు చుక్కలు చూపించింది.. గంటల తరబడి ట్రాఫిక్‌లో నిలబెట్టింది.. ఓవైపు జోరు వాన, మరోవైపు చెరువులను తలపించే రోడ్లు.. ఇలా అర్ధరాత్రి దాటినా రోడ్లపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయితే, సెప్టెంబర్‌ నెలలో ఈ స్థాయిలో వర్షాలు పడడం 111 ఏళ్లలో ఇదే మొదటిసారి అంటున్నారు అధికారులు.. అల్వాల్‌, కాప్రా, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, జూబ్లీహిల్స్‌, యూసుఫ్‌గూడ, మెహిదీపట్నం, చార్మినార్‌, సికింద్రాబాద్‌, ఎల్బీనగర్‌, ఖైరతాబాద్‌, గోషామహల్‌, అంబర్‌పేట్‌, బేగంపేట్‌, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, ముసాపేట్‌, ఉప్పల్‌ ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. సగటున 1 సెంటీమీటర్ నుంచి 12 సెంటీమీటర్ల వరకు వాన కురిసింది. అయితే, 1908లో సెప్టెంబరు 27న ఒకేరోజు హైదరాబాద్‌లో 15.3 సెం.మీల వర్షపాతం నమోదైంది. దాదాపు 111 ఏళ్ల తర్వాత మంగళవారం 24 గంటల్లో కురిసిన 12.1 సెంటీమీటర్ల వర్షమే అత్యధికం. సెప్టెంబర్‌లో గత 111 ఏళ్లలో ఇదే రికార్డు స్థాయి వర్షపాతమని చెబుతున్నారు అధికారులు. 

మరోవైపు జోరువానలో సైతం సహాయక చర్యలు కొనసాగించారు జీహెచ్ఎంసీ అధికారులు.. ఓ వైపు పోలీసులు, విద్యుత్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు.. ఇలా అందరూ భాగస్వాములై ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రయత్నించారు. ఇక సోషల్ మీడియా వేదికగా అందరికీ ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్.. ఇంతటి అతిపెద్వ వర్షపాతం వందేళ్ల తర్వాత నమోదైంది.. వర్షాలపై అప్రమత్తంగా ఉన్న అందరు అధికారులు, సిబ్బందికి, పోలీసులకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు కేటీఆర్.